ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు ? ఏపీ భూభాగం పరిధిలో ఎందుకు ఏర్పాటు చేయరని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది . కార్యాలయం ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచేలా చర్యలెందుకు తీసుకోవడం లేదని వ్యాఖ్యానించింది . హెచ్ఆర్ సీ ప్రజలకు అందుబాటులో ఉండటం చాలా ముఖ్యమని పేర్కొంది . హెచ్ఆర్ సీ ఛైర్మన్ , సభ్యులను నియమించడంతో బాధ్యత తీరిపోదని , కార్యాలయం ఏర్పాటు , సిబ్బందిని కేటాయించాల్సి ఉంటుందని స్పష్టంచేసింది . ఏపీ హెచ్ఆర్ సీ కార్యాలయం హైదరాబాద్ లో ఎందుకని ప్రశ్నించింది . సేవలు అందించాల్సింది ఏపీ నుంచి కదా అని పేర్కొంది . ఏపీలో ఏదైనా ఘటన జరిగితే తెలంగాణకు వెళ్లి అక్కడి ఏపీ హెచ్ ఆర్ సీకి ఫిర్యాదు చేయాలా ? అని ఘాటుగా వ్యాఖ్యానించింది . హెచ్ఆర్సీ ఏర్పాటు ఉద్దేశం ప్రజలకు దూరంగా ఉంచడం కాదని స్పష్టంచేసింది . ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ .. పూర్తి వివరాలు సమర్పించేందుకు పది రోజుల సమయం కావాలని కోరారు . అందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది . హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి , జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది .
హెర్ఆర్ సీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోవడాన్ని సవాలు చేస్తూ ఏపీ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి ఏకేఎన్ మల్లేశ్వరరావు హైకోర్టులో పిల్ వేశారు . పిటిషనర్ తరఫు న్యాయవాది పొత్తూరి సురేశ్ కుమార్ వాదనలు వినిపిస్తూ .. ఛైర్మన్ , సభ్యులను నియమించినప్పటికీ హెచ్ ఆర్సీ కార్యాలయం ఏర్పాటు చేయలేదన్నారు . వీటి చిరునామా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు .