హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్‌కు కాంగ్రెస్ పిలుపునివ్వగా.. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. దిల్‌సుఖ్‌నగర్ నుంచి ఎల్బీనగర్ వరకు ర్యాలీ చేస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ర్యాలీకి వెళ్లకుండా రేవంత్‌రెడ్డిని అడ్డుకునేందుకు పోలీసులు అతని ఇంటివద్ద భారీగా మోహరించారు. ఆయన ఇంటిని చుట్టుముట్టారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులతో పాటు ప్రత్యేక పోలీసులు రంగంలోకి దిగారు. దిల్‌సుఖ్‌నగర్ రాజీవ్‌చౌక్ వద్ద ముందస్తు ర్యాలీ తీయకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
కాంగ్రెస్ నేతల గృహనిర్బంధం
ఈ ర్యాలీకి అనుమతి లేదంటూ కాంగ్రెస్ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సీతక్కను అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిని గృహనిర్బంధం చేశారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. పొన్నం ప్రభాకర్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
దిల్‌సుఖ్‌నగర్ మెట్రో స్టేషన్ మూసివేత
మరోవైపు, దిల్‌సుఖ్‌నగర్ వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. అక్కడ దుకాణాలను మూసివేయిస్తున్నారు. దిల్‌సుఖ్‌నగర్ నుంచి ఎల్బీనగర్ వరకు ర్యాలీ చేపడతానని రేవంత్ ప్రకటించడంతో అప్రమత్తమైన అధికారులు.. దిల్‌సుఖ్‌నగర్ మెట్రో స్టేషన్‌ను మూసివేశారు.