కరోనా ఈ పేరు వింటే చాలు ఆమడ దూరం వెళతారు. కొవిడ్‌తో మరణిస్తే అందరూ ఉన్నా అనాథల్లా మృతదేహానికి అంత్యక్రియలు చేయాల్సి వస్తుంది. వైరస్ బారిన పడిన బాధితులకు, మరణించిన కుటుంబాలకు మేమున్నామంటూ ముందుకు వస్తుంది హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ. కరోనా మృతదేహాలకు సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు చేస్తూ.. రక్త సంబంధీకులుగా మారుతున్నారు.
'ఆసుపత్రిలో అన్నదానం చేస్తున్నాం .. కరోనాతో ఓ బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుని తల్లి ఆసుపత్రి బయట కూర్చుని కుమారుని ఆరోగ్యం ఎలా ఉంది ? అన్నం తిన్నాడా లేదా ? అని తెలియక విలవిల్లాడిపోతుంది. ఆమె ఆకలితో అలమటిస్తున్నా.. అన్నం తినకుండా కన్నపేగు కోసం కన్నీరుపెడుతుంది. మరొకరు తమ బంధువు కరోనాతో మృతి చెందాడు. దహనసంస్కారాలు చేయాలంటే ఊళ్లో రానివ్వరు. సాంప్రదాయంగా అంత్యక్రియలు జరిపేందుకు అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు నన్ను కదిలించాయి. మా సంస్థ ద్వారా వారికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నా.. కరోనాతో మృతి చెందిన వారికి సంప్రదాయాలకు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నాను' హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ వ్యవస్థాపకుడు వెంకట్ చెబుతున్న మాటలివి.
8 ఏళ్లుగా కన్నీళ్లు తుడుస్తూ..
హెల్పింగ్ హ్యాండ్స్! గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ. దాదాపు 8 ఏళ్లుగా కష్టాల్లో ఉన్న నిరుపేదల కన్నీళ్లు తుడుస్తూ వారికి అవసరమైన కనీస అవసరాల్ని తీర్చుతోంది. ఆకలితో ఆలమటిస్తున్న వారికి ఆహారం, ఆరోగ్యం సరిగా లేని వారికి వైద్య సేవలు అందిస్తూ సేవకూ నిర్వచనంగా నిలుస్తోంది. మానవత్వా న్ని ప్రశ్నార్థకం చేసిన కరోనా కష్టకాలంలోనూ సామాజిక కార్యక్రమాలు చేపట్టింది.
విజయనగరంలో ఓ ఘటన
సేవ చేయాలనే ఆలోచన ఉన్న యువతను వాలంటీర్లుగా చేర్చుకుని..ఎప్పటికప్పుడూ సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నాడు హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ వ్యవస్థాపకుడు వెంకట్. విజయవాడకు చెందిన ఈ యువకుడు.. విజయనగరంలో ఉద్యోగం చేస్తున్న సమయంలో జరిగిన ఓ సంఘటన ఈ సంస్థను ఏర్పాటు చేసేందుకు కారణమైంది. ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేసేటప్పుడు.. జ్వరానికి ఔషధాలు కొనలేకపోవటంతో ఏజెన్సీకి చెందిన ఓ చిన్నారి మరణించింది. ఆ చిన్నారి మరణంతో హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో 8 యేళ్ల కిందట స్వచ్ఛంద సంస్థను ప్రారంభించానని వెంకట్ తెలిపారు.
కొవిడ్ బాధితులకు ఆహారం సరఫరా