విజయవాడ వాసులను ట్రాఫిక్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఉదయం పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, వ్యాపారులు.. వాహనాల రద్దీతో రహదారులపైనే గంటల తరబడి గడపాల్సిన పరిస్థితి. బెంజ్ సర్కిల్, రామవరప్పాడు సహా ప్రధాన కూడళ్ల వద్ద స్థానికులకు నిత్యం ట్రాఫిక్ సమస్య తలనొప్పిగా మారింది. వాహనదారుల సహనానికి పరీక్ష తప్పడం లేదు. విలువైన సమయమంతా రహదారిపైనే గడిచిపోతుందని వాపోతున్నారు.
కుమ్మరిపాలెం సెంటర్, బందరు రోడ్డు, పడమట, ఎన్టీఆర్ సర్కిల్, ఏలూరు రోడ్డు, మాచవరం డౌన్, గుణదల సెంటర్, కాళేశ్వరరావు మార్కెట్, బొడ్డెమ్మ హోటల్, నెహ్రూ బొమ్మ సెంటర్, చిట్టినగర్, రథం సెంటర్ ఇలా నగరంలో ఏ మూల చూసిన ట్రాఫిక్ వలయంలో చిక్కుకున్న వాహనాలే దర్శనమిస్తున్నాయి. ఈ ట్రాఫిక్‌తో చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నామని ఆటోవాలాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.