విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణా నది ఉగ్రరూపం దాల్చింది. జలవనరుల శాఖ అధికారులు ప్రకాశం బ్యారేజ్ నుంచి 2 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజి 70 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి.. నీటిని సముద్రంలోకి వదులుతున్నట్లు తెలిపారు. ప్రకాశం బ్యారేజీలో పూర్తిస్థాయి నీటిమట్టం 3.07 టీఎంసీలు ఉంచుతూనే.. నీటిని సముద్రంలోకి వదులుతున్నట్లు పేర్కొన్నారు. ప్రధాన పంట కాలువలకు తొమ్మిది వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు తెలిపారు. వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందని ప్రకాశం బ్యారేజ్ అధికారులు అన్నారు.
అన్ని శాఖల సమన్వయంతో ముంపు ప్రాంతాల్లో తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని జలవనరులశాఖ ఈఈ రాజ స్వరూప్ అన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా.. 12 స్టాక్ పాయింట్లలో ఇసుక సంచులను ఏర్పాటు చేసినట్లు ఈఈ తెలిపారు. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్‌కు లక్షన్నర క్యూసెక్కులు వస్తున్నాయి.