కరోనా తొలి దశలో 60 ఏళ్లు దాటినవారు, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నవారు ఎక్కువగా మరణించారు. రెండో దశలో 25, 30 ఏళ్ల యువకులు ఎక్కువగా చనిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. అప్పటివరకు బాగా ఉన్నవారు ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలుతున్నారు. కొందరు కరోనా తగ్గి.. ఇంటికి వెళ్లి మందులు వాడుతూ కూడా గుండెపోటుతో మరణిస్తున్నారు. కొందరు రోగుల రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం (థ్రాంబోసిస్) వల్ల గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయని కరోనా తొలి దశలోనే వైద్యులు గుర్తించారు. హెపారిన్, ఎకోస్ప్రిన్ వంటి రక్తాన్ని పలుచగా ఉంచే మందులను ఇవ్వడం కరోనా చికిత్సలో భాగం చేశారు. అయినా కూడా గుండె సంబంధిత సమస్యలతో చనిపోతున్న రోగుల సంఖ్య రెండో దశలో ఎక్కువగా ఉంటోంది. దీనికి కారణాలేంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్న అంశంపై విజయవాడలోని ఆంధ్రా ఆసుపత్రి కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ దిలీప్, సీనియర్ హృద్రోగ వైద్య నిపుణుడు, మెడికవర్ ఆసుపత్రుల సీఎండీ డాక్టర్ అనిల్‌కృష్ణల విశ్లేషణ, సూచనలివి.
పెను ప్రభావం
కరోనా కొత్త వేరియంట్ వల్లగానీ, ఇతర కారణాల వల్లగానీ రెండో దశలో ఎక్కువ మంది యువత బాధితులవుతున్నారు. లోగడ కరోనా సోకిన వారిలో వ్యాధి తీవ్రత పెరిగి సైటోకైన్‌స్టార్మ్ మొదలవడానికి వారం పది రోజులు పట్టేది. ఇప్పుడు 3,4 రోజులకే సైటోకైన్‌స్టార్మ్ మొదలవుతోంది. ఊపిరితిత్తులతోపాటు చాలా వ్యవస్థలపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. చూస్తుండగానే పరిస్థితి చేయి దాటుతోంది. ఇప్పటికీ కరోనా మరణాల్లో అధిక శాతం ఊపిరితిత్తులు దెబ్బతినడం వల్లే సంభవిస్తున్నప్పటికీ.. గుండెపోటుతో చనిపోతున్నవారి సంఖ్యా ఎక్కువే.
* కరోనా ప్రభావంతో ఏర్పడే సైటోకైన్ల ఉప్పెన వల్ల గుండె కండరాల పనితీరు దెబ్బతింటోంది. గుండె పరిమాణం పెరగడం, రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యం తగ్గడంతో చిన్న వయసువారిలోనూ ఒకలాంటి ఆయాసం వస్తోంది. గుండెపోటు సంభవిస్తోంది. దీన్ని వైరల్ మయోకార్డైటిస్ అంటారు. ఇది ఎక్కువగా కరోనాకు చికిత్స పొందుతున్న సమయంలో జరుగుతోంది.
* కొవిడ్ ఉన్నప్పుడు.. వైరస్ ప్రభావం తగ్గాక కూడా కొందరి రక్తనాళాల్లో రక్తపు గడ్డలు (థ్రాంబోసిస్) ఏర్పడుతున్నాయి. సూక్ష్మ రక్తనాళాల్లోనూ (కేశనాళికలు) గడ్డలు ఏర్పడుతున్నాయి. కొందరిలో మల్టిపుల్ థ్రాంబోసిస్ (అనేక రక్తనాళాల్లో గడ్డలు) సమస్య కనిపిస్తోంది. గుండెకు రక్తసరఫరా తగినంత జరగకపోవడం వల్ల మల్టిపుల్ థ్రాంబోసిస్ ఏర్పడిన వారిలో వయసుతో సంబంధం లేకుండా మరణాలు సంభవిస్తున్నాయి.
* కరోనా వల్ల కొందరికి కాళ్లలోని రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడుతున్నాయి. ఎక్కువ కాలం ఐసీయూలో ఉండటం కూడా దీనికి కారణం కావొచ్చు. ఆ గడ్డలు గుండెకు కుడివైపు వెంట్రికల్స్‌లోకి వెళ్లి అక్కడ బ్లాక్‌లు ఏర్పడటం వల్ల ఆ ప్రాంతం దెబ్బతింటోంది. దీనివల్ల గుండె ఎడమపక్క భాగానికీ రక్తం సరఫరా కావడం లేదు. ఇదీ గుండెపోటుకు కారణమవుతోంది. దీన్ని పల్మనరీ థ్రాంబోఎంబాలిజం అంటారు.
* వీటన్నింటి ప్రభావం వల్ల గుండె రక్తం పంప్ చేసే సామర్థ్యం (ఎజెక్షన్ ఫ్రాక్షన్- ఈఎఫ్) తగ్గుతుంది. సాధారణంగా ఈఎఫ్ 65-70 శాతం ఉండాలి. ఈ సమస్య ఉన్నవారిలో అది 25-30 శాతమే ఉంటోంది. ఊపిరితిత్తుల నుంచి గుండెకు 100 మి.లీ. రక్తం సరఫరా అయితే.. దానిలో 65 శాతం రక్తాన్ని గుండె నుంచి శరీర భాగాలకు పంప్ చేయాలి. కానీ ఈ సమస్య ఉన్నవారిలో అది 25-30 శాతానికి కూడా పడిపోతోంది. దీన్ని కార్డియోమయోపతి అంటారు. దీనివల్లా మరణాలు సంభవిస్తున్నాయి. ఈఎఫ్ శాతం పడిపోయిన వారికి చికిత్స కష్టమవుతోంది.
ముందుగానే మందులు ఇచ్చినప్పటికీ...!
రక్తనాళాల్లో పేరుకున్న క్లాట్ బద్దలైనప్పుడు డి-డైమర్ విడుదలవుతుంది. ఆరోగ్యవంతుల్లో డి-డైమర్ పరిమాణం 250కంటే తక్కువ ఉండాలి. కరోనా రోగులు కొందరిలో డి-డైమర్ పరిమాణం అనేక రెట్లు పెరిగిపోతోంది. అందుకే కరోనాకు వైద్యం మొదలుపెట్టినప్పుడే రక్తం గడ్డకట్టకుండా మందులూ ఇస్తున్నారు. డి-డైమర్ పరీక్ష ద్వారా ఒక వ్యక్తి శరీరంలో రక్తం గడ్డకట్టే స్వభావాన్ని తెలుసుకోవచ్చు. కొందరిలో ముందుగానే రక్తం గడ్డకట్టకుండా మందులు వాడుతున్నా కూడా థ్రాంబోసిస్ ఏర్పడుతోంది. కరోనా వచ్చి తగ్గాక కూడా ఈ సమస్య తలెత్తుతోంది. అందుకే కరోనా వచ్చి తగ్గాక కూడా 2,3 నెలలపాటు రక్తం గడ్డకట్టకుండా నిరోధించే మందులు ఇస్తున్నారు.
పరిస్థితి చేయిదాటాక వస్తున్నారు..