HC on Covid pending bills: కొవిడ్ కేర్ కేంద్రాలకు ఆహారం సరఫరా చేసిన తమకు ప్రభుత్వం రూ. 2కోట్ల 4 లక్షల బకాయిలు చెల్లించలేదని శ్రీకాకుళానికి చెందిన మినర్వా హోటల్ యజమాని మెట్ట నాగరాజు దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ కేంద్రాలకు ఆహారం సరఫరా చేసిన గుత్తేదారులకు బకాయిల సొమ్ము ఎంత చెల్లించాలో చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం ఎందుకు జరిగిందో వివరణ ఇవ్వాలంది. రోగులకు డైట్ కింద ప్రభుత్వం చెల్లిస్తున్న సొమ్ము తక్కువగా ఉందని.. ఆ ధరలను సమీక్షించి పెంచే విషయాన్ని పరిశీలించాలని సూచించింది. కరోనా సమయంలో వివిధ సంస్థలు, వ్యక్తులు ఇచ్చిన విరాళాల్లో కొంతైనా బిల్లుల చెల్లింపుకోసం వినియోగిస్తే కోర్టు కొచ్చి వివరణ ఇచ్చే పరిస్థితి ఉండేది కాదని వ్యాఖ్యానించింది.
బిల్లుల చెల్లింపుల్లో జాప్యానికి క్షమాపణలు
విజయనగరం జిల్లా గుత్తేదారులకు డైట్ ఛార్జ్‌ల బకాయిలను తక్షణం చెల్లించాలని అధికారులను ఆదేశించింది. బకాయిల చెల్లింపులో జరుగుతున్న జాప్యంపై వివరణ అడిగితే ప్రతి శాఖాధికారులు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిని బాధ్యుడిగా చెబుతున్నారని హైకోర్టు తెలిపింది. బిల్లుల చెల్లింపులో జరిగిన ఆలస్యంపై వివరణ ఇచ్చేందుకు వైద్యఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ హైకోర్టుకు హాజరయ్యారు . కొవిడ్ కేర్ కేంద్రానికి ఆహారం సరఫరా చేసిన పిటిషనర్‌కు బిల్లులు చెల్లించామన్నారు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యానికి క్షమాపణలు చెప్పారు.
మీకు అలాంటి అనుభవం ఏమైనా ఉందా..
బడ్జెట్ కారణంగా ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రావత్.. విచారణకు హాజరుకాకపోవడంపై న్యాయమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రావత్ కోర్టుకు తరచూ వచ్చే అతిథి అని సంబోధించారు. తరచూ హాజరుకావడానికి ఆయనకు బాధగా ఉందో లేదో కాని .. ప్రతిసారి పిలవడం కోర్టుకు ఇబ్బందిగా ఉందన్నారు. విద్యార్థిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా హోటల్‌కు వెళ్లి డబ్బులు లేక మీరు బిల్లు చెల్లించని అనుభవం ఏమైనా ఉందా అని ముఖ్య కార్యదర్శి సింఘాల్‌ను న్యాయమూర్తి అడిగారు. అందుకు బదులిస్తూ.. తనకు అలాంటి అనుభవం లేదన్నారు. తన మిత్రుల బిల్లు చెల్లించకపోతే హోటల్ యజమాని పాత్రలు శుభ్రం చేయించారని తెలిపారు.
ఆ సొమ్ములో చెల్లింస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు
న్యాయమూర్తి స్పందిస్తూ.. బిల్లులు చెల్లించని మీపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నారు. ఆరోగ్యశాఖ నుంచి ఎంత మొత్తం బిల్లు బకాయిలు చెల్లించాలని న్యాయమూర్తి ప్రశ్నించగా...కొవిడ్ అవసరాల కోసం ఖర్చు చేసిన మొత్తం రూ. 241 కోట్లు కలెక్టర్లకు చెల్లించాల్సి ఉందని సింఘాల్ బదులిచ్చారు. 241 కోట్ల బిల్లుల చెల్లింపుకోసం సీఎఫ్ఎంఎస్ అప్లోడ్ చేశామన్నారు. మరో రూ. 182 కోట్ల బిల్లులను అప్లోడ్ చేయాల్సి ఉందన్నారు. కొవిడ్ సమయంలో ప్రభుత్వానికి, కలెక్టర్లకు వివిధ సంస్థలు, వ్యక్తులు భారీగా విరాళాలుగా ఇచ్చారని న్యాయమూర్తి గుర్తుచేశారు. ఆ సమయంలో ' సాక్షి ' పత్రికలో ప్రచురించిన కథనాలను పరిశీలిస్తే ఎంత విరాళాలు వచ్చాయో తేలుతుందన్నారు. విరాళాలుగా వచ్చిన సొమ్ములో కొంతైనా చెల్లించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.
ఇదీ చదవండి:
కొవిడ్ కేంద్రాలకు ఆహార బిల్లుల చెల్లింపులో ఆలస్యమేంటి..?:హైకోర్టు