simha garjana meeting: సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పింఛన్ విధానాన్ని తీసుకురావాలని వివిధ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చాక వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన సీఎంకు... ఆ వారం ఎప్పుడొస్తుందని ప్రశ్నించారు. విజయవాడలో శుక్రవారం ఏపీ సీపీఎస్ ఉద్యోగుల అసోసియేషన్ (ఏపీసీపీఎస్‌ఈఏ) ఆధ్వర్యంలో ‘సింహగర్జన’ పేరిట ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు.
అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్‌ను రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో జగన్ హామీ ఇచ్చారు. మూడేళ్లు గడిచినా చేయలేదు. సీఎంకు వారం ఎప్పుడవుతుందా అని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. పీఆర్సీ ప్రకటన చేసినా... సీపీఎస్ రద్దు చేసే వరకు ఆందోళన కొనసాగిస్తాం. మాకు ప్రత్యామ్నాయ విధానాలు వద్దు. సమస్యల పరిష్కారంపై సీఎం చిత్తశుద్ధితో ఎందుకు ముందుకు రావడం లేదో అర్థం కావడం లేదు. సీపీఎస్‌పై కొందరు ఎమ్మెల్యేలు విమర్శలు చేస్తున్నారు. ఇలా చెబుతున్న ఎమ్మెల్యేలకు పింఛన్లు ఎందుకు? మీ పింఛన్లను రద్దు చేసుకుంటారా? ఆలస్యం చేయకుండా పీఆర్సీ ఇస్తామన్నారు. ఒప్పంద ఉద్యోగాలు రెగ్యులర్ చేస్తామన్నారు. ఈ హామీలపై ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి వచ్చింది’’ -బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఐకాస అమరావతి ఛైర్మన్
సీపీఎస్ రద్దుకు ప్రభుత్వంపై ఒత్తిడి: వెంకట్రామిరెడ్డి
సీపీఎస్ రద్దుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. ‘‘సీపీఎస్ రద్దుకు సంఘాలు చేసే ఉద్యమానికి మద్దతు ఇస్తాను. మీరంతా కుటుంబాలతో వచ్చి రోడ్డుపై కూర్చుంటే కుటుంబంతో వచ్చి నేనూ రోడ్డుపై కూర్చుంటా. పాదయాత్రలతో ఉపయోగం లేదు’’ అని అన్నారు.
దీర్ఘకాలిక పోరాటాలు చేయాలి: సూర్యనారాయణ
సీపీఎస్ రద్దుకు దీర్ఘకాలిక పోరాటాలు చేయాల్సిన అవసరముందని ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్ ఛైర్మన్ సూర్యనారాయణ సూచించారు. ఉద్యోగులు చిత్తశుద్ధితో ఆందోళన చేసినప్పుడే రద్దు సాధ్యమవుతుందని, సంఘాలన్నీ ఐక్యమై ఉద్యమించాలన్నారు.