Govt Advisor ChandraShekar Reddy On PRC: జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని ఉద్యోగ సంఘాలతో పీఆర్సీపై ప్రభుత్వం చర్చించినట్లు ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కొద్దిరోజుల్లోనే పీఆర్సీ అంశానికి ముగింపు ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులను కూడా ఉద్యోగ సంఘాలకు వివరించి చెప్పామన్నారు. కొన్ని రోజుల్లోనే ప్రభుత్వం నుంచి పీఆర్సీపై ప్రకటన వస్తుందని స్పష్టం చేశారు. కొద్ది రోజులు వేచి చూడాలని ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.
తేలని పంచాయితీ..
మరోవైపు పీఆర్సీపై ఆర్థికశాఖ అధికారులతో జరిగిన భేటీలో ఎలాంటి పురోగతి కనిపించలేదని ఉద్యోగ సంఘాల నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీఎన్జీవో, ఏపీ రెవెన్యూ తదితర సంఘాలతో అధికారుల భేటీ నిర్వహించినప్పటికీ.. సమస్య కొలిక్కి రాలేదని ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. ప్రభుత్వం పదే పదే సమావేశాలు నిర్వహిస్తూ అవమానిస్తుందే తప్ప.. న్యాయం మాత్రం చేయటం లేదన్నారు. 2 వేల కోట్ల ఉద్యోగుల బిల్లులు చెల్లింపులపై ప్రభుత్వం నోరు విప్పకపోవటం అవమానకరమని అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
"పీఆర్సీపై ఉద్యమించిన 2,500 మందికి మెమోలు ఇచ్చారు. కుంటిసాకులతో కొందరు నేతలను సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ ఎత్తివేయకపోతే చర్చలకు రాబోమని చెప్పాం. ఈసారి సీఎం వద్ద మాత్రమే భేటీ ఏర్పాటు చేయాలని కోరాం. ఉద్యోగులకు 75 శాతం ఖర్చు చేస్తున్నామనడం అసత్యం. జీపీఎఫ్ సొమ్ము రూ.2,100 కోట్లు పక్కదారి పట్టించారు. ఫిట్‌మెంట్ 14.29 శాతమే ఇస్తామని ప్రతిపాదిస్తున్నారు. ఉద్యోగులను అవమానిస్తున్నా సహిస్తున్నాం. ఇప్పటి వరకు 7 డీఏలు చెల్లించలేదు. డీఏ బకాయిలు రూ.6 వేల కోట్లు ఇవ్వాలి. పీఆర్సీతో పాటు సీపీఎస్ రద్దుపై వెల్లడించాలి. ఒప్పంద సిబ్బంది క్రమబద్ధీకరణపై వెల్లడించాలి." - బొప్పరాజు వెంకటేశ్వర్లు, అమరావతి జేఏసీ ఛైర్మన్
ప్రభుత్వ చర్చలతో ఎలాంటి ఉపయోగం లేదు..
ప్రభుత్వం నిర్వహిస్తున్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ విడతల వారి సమావేశంతో ఎలాంటి ఉపయోగం లేదని ఏపీ జేఏసీ నేత బండి శ్రీనివాసరావు అన్నారు. 2 వేల కోట్ల ఉద్యోగుల బిల్లులు చెల్లింపులపై ప్రభుత్వం మాట్లాడకుండా పెండింగ్లో పెడుతున్నారన్నారు. ప్రతిసారి ప్రభుత్వం నుంచి ఒకే సమాధానం రావటం విచారకరమన్నారు. 14.29 శాతం ఫిట్‌మెంట్ పైనే ప్రభుత్వం మాట్లాడుతోందని, దీన్ని పరిగణనలోకి తీసుకోబోమని తేల్చి చెప్పామని తెలిపారు. పీఆర్సీ నివేదికలోని 42 పేజీలతో ప్రభుత్వం ఇచ్చిన నివేదికనైనా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. తిరుపతిలో సీఎం జగన్, అమరావతిలో సీఎస్ ఇచ్చిన హామీలు ఇప్పటికి నెరవేరని పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వ వైఖరి ఇలాగే ఉంటే తదుపరి కార్యాచరణకు వెళ్లక తప్పదని హెచ్చరించారు.