Governor orders to postpone convocations: రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా.. జనవరి, ఫిబ్రవరి నెలల్లో.. షెడ్యూల్ చేసిన రాష్ట్ర విశ్వవిద్యాలయాల వార్షిక స్నాతకోత్సవాలను వాయిదా వేయాలని ఉపకులపతులకు.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదేశించారు. రోజువారీగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య.. కొత్తగా ఒమిక్రాన్ వేరియంట్ ఆవిర్భావం దృష్ట్యా.. గవర్నర్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే పలు విశ్వవిద్యాలయాలు స్నాతకోత్సవాల తేదీలను ఖరారు చేయగా, వాటిని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తదనుగుణంగా విశ్వవిద్యాలయాలకు సమాచారం పంపాలని.. రాజ్ భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియాను ఆదేశించారు.
విద్యార్థుల భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ స్నాతకోత్సవాలను.. క్రమం తప్పకుండా నిర్వహించాలని గవర్నర్ హరిచందన్ గతంలో వైస్ ఛాన్సలర్‌లకు సూచించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో.. అందరి ఆరోగ్య సంక్షేమం దృష్ట్యా ఇప్పటికే షెడ్యూల్ చేసిన స్నాతకోత్సవాలను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ ముప్పు వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు గవర్నర్ తెలిపారు.