Governor: ప్రతిభావంతులను వ్యవస్థకు అందించేలా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు పని చేయాలని.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కోరారు. విశాఖపట్నం వేదికగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధ్యక్షుల స్టాండింగ్ కమిటీ సదస్సు జరిగింది. ఈ సదస్సులో విజయవాడ రాజ్‌భవన్ నుంచి వర్చువల్ మోడ్‌లో గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ.. స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లు విధులు నిర్వర్తించాలని సూచించారు.
ప్రభుత్వపరమైన ఉద్యోగ నియామకాల్లో పబ్లిక్ సర్వీస్ కమీషన్లు కీలక భూమిక పోషిస్తాయని, ప్రతిభకు పెద్దపీట వేసేలా నియామక ప్రక్రియలు కొనసాగాలని గవర్నర్ సూచించారు. కాలానుగుణ నోటిఫికేషన్లు, సకాలంలో నియామకాలు పూర్తి చేయటం పబ్లిక్ సర్వీస్ కమీషన్ ప్రధాన బాధ్యతలలో ఒకటని అన్నారు. పత్రికా ప్రకటన మొదలు అభ్యర్ధికి ఉద్యోగ నియామక పత్రం అందించే వరకు ప్రతి అంశంలోనూ పారదర్శకత, సమగ్రత, విశ్వసనీయత తప్పనిసరన్నారు.