telugu medium: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమ బోధనను ఎత్తివేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. రాయలసీమ జిల్లాలకు చెందిన విద్యాధికారులు ఇటీవల టెలీకాన్ఫరెన్స్ నిర్వహించగా... పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ తరఫున అధికారులు పాల్గొన్నారు. ఉన్నత పాఠశాలల్లో 3 నుంచి 8 తరగతుల దాకా ఒకే మాధ్యమం, ఒకే సెక్షన్ ఉండాలని ఆదేశించారు. ఒక మాధ్యమం ప్రకారమే ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తిని లెక్కించాలని.. ఆ ప్రకారం టీచర్ల జాబితాను పంపాలని సూచించారు. 9, 10 తరగతులకు రెండు మాధ్యమాలనూ కొనసాగించాలన్నారు. ఒకే మాధ్యమమంటే దేనిని ఉంచాలి? దేనిని తొలగించాలి?... అని కొంతమంది ప్రధానోపాధ్యాయులు ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున.. తాము చెప్పకూడదని ఉన్నతాధికారులు సమాధానమిచ్చారు. 6, 7, 8 తరగతుల్లో తెలుగు మాధ్యమ విద్యార్థులు తక్కువగా ఉంటే వారి తల్లిదండ్రులకు నచ్చజెప్పి ఆంగ్ల మాధ్యమంలో కలిపేయాలని ఓ అధికారి వెల్లడించారు.
ఉపాధ్యాయుల కొరత..
నూతన విద్యా విధానమంటూ 2,663 ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో కలిపారు. ఏకోపాధ్యాయ ప్రాథమిక బడుల నుంచి విద్యార్థులు వచ్చినా ఉపాధ్యాయులు రాలేదు. వీరికి సబ్జెక్టుల వారీగా బోధన సాగించేందుకు టీచర్ల కొరత ఏర్పడింది. దీనికి పరిష్కారంగా ఒకే మాధ్యమ విధానాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. 60 మంది విద్యార్థుల వరకు ఒకే సెక్షన్ ఏర్పాటు చేయాలని.. ఇంకా ఎక్కువగా ఉంటే మరో సెక్షన్ పెట్టాలని సూచించారు. మాధ్యమాలతో సంబంధం లేకుండా 40 మంది విద్యార్థులకు ఒక టీచర్ చొప్పున.. ఉపాధ్యాయులు, విద్యార్థుల జాబితాను సిద్ధం చేసి పంపాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ క్రమంలో మిగిలిన ఉపాధ్యాయులను అవసరమైన బడులకు సర్దుబాటు చేయనున్నారు.