ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

APSDC: మద్యంపై ప్రత్యేక మార్జిన్​ వసూలు.. ఖజానాకు పంపకుండా కొత్త ఎత్తుగడ

APSDC: రాష్ట్ర ప్రభుత్వం వేసిన కొత్త ఎత్తుగడ.. ఆర్థిక నిపుణులను కూడా విస్మయానికి గురి చేస్తోంది. మద్యంపై ప్రత్యేక మార్జిన్‌ వసూలు చేసిన ప్రభుత్వం... ఆ డబ్బును ఖజానాకు పంపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

government transferred revenue to the APSDC
ఆదాయాన్ని ఏపీఎస్‌డీసీకి తరలించి అవసరాలు తీర్చుకున్న సర్కార్

By

Published : Mar 16, 2022, 9:06 AM IST

ఆదాయాన్ని ఏపీఎస్‌డీసీకి తరలించి అవసరాలు తీర్చుకున్న సర్కార్

APSDC: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఎత్తుగడలపై ఆర్థిక నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మద్యంపై అదనపు ఎక్సైజ్‌ సుంకం విధించి.. భవిష్యత్తులో సంబంధిత ఆదాయాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృధ్ధి కార్పొరేషన్‌కు మళ్లించి.. ఆ కార్పొరేషన్‌ ద్వారా వేల కోట్ల రూపాయలు తెచ్చి ప్రభుత్వ అవసరాలు తీర్చుకునే ఆలోచన గత రెండేళ్లుగా అమలు చేసింది. అదనపు ఎక్సైజ్‌ సుంకం ఖజానాకు వచ్చిన తర్వాతే కార్పొరేషన్‌కు మళ్లిస్తున్నామని.. ఖజానాకు రాకుండా మళ్లించడం అబద్ధమని అప్పట్లో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. అయినా భవిష్యత్తు ఆదాయం మళ్లించడం తప్పని కేంద్ర ఆర్థికశాఖ తేల్చిచెప్పింది. రాష్ట్ర కార్పొరేషన్లకు రుణాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని బ్యాంకులకు కూడా కేంద్రం సూచించింది.

వ్యాట్‌ రూపేణా రూ.5 వేల కోట్లు కోల్పోతున్నామన్న ప్రభుత్వం

మద్యంపై ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్‌ను తగ్గించింది. అందుకు చట్టసవరణ చేసింది. వ్యాట్‌ రూపేణా రూ.5 వేల కోట్లు కోల్పోతున్నామని ప్రభుత్వం ప్రకటించింది. 1993 (I.M.F.L) ఐ.ఎమ్.ఎఫ్.ఎల్ చట్టానికి 5/2012లో చేసిన చట్ట సవరణకు మళ్లీ సవరణ ప్రతిపాదించి... ఆ బిల్లు శాసనసభలో ప్రవేశపెట్టింది. ఈ సవరణ ప్రకారం బెవరేజస్‌ కార్పొరేషన్‌ మద్యంపై వసూలుచేసే ప్రత్యేక మార్జిన్‌.. ఆ కార్పొరేషన్‌ ఆదాయమేనని చట్ట సవరణకు సభల ఆమోదం తీసుకోనుంది. వ్యాట్‌ రూపంలో తగ్గించిన దాని కంటే.. అదనంగా ప్రత్యేక మార్జిన్‌ రూపంలో మద్యంపై వసూలు చేస్తున్నారు. వివిధ బ్రాండ్లపై వివిధ శాతాల్లో వ్యాట్‌ తగ్గించి, దాదాపు అంతే మొత్తానికి బెవరేజస్‌ కార్పొరేషన్‌ ప్రత్యేక మార్జిన్‌ రూపంలో విధించి వసూలు చేసుకుని... తన ఆదాయంగా చూపించవచ్చని పేర్కొంది. ప్రభుత్వ ఆదాయాన్ని కార్పొరేషన్‌కు మళ్లించేందుకు చట్టరూపంలో కొత్త ఎత్తుగడతో అవకాశం కల్పించారని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

మార్జిన్‌ రూపంలో మద్యంపై వసూలు..!
బెవరేజస్‌ కార్పొరేషన్‌ ప్రత్యేక మార్జిన్‌ రూపంలో మద్యంపై వసూలు చేసుకునే అధికారం ఉందా అంటే.. ఇది రాజ్యాంగ విరుద్ధమని, అలాంటి అవకాశం లేదని ఆర్థికశాఖలో ఒకప్పుడు పనిచేసిన వారు, ఇతర నిపుణులు సూత్రీకరిస్తున్నారు. రాజ్యాంగం ఏడో షెడ్యూలులో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అంశాలు ఉన్నాయని.. రాష్ట్రంలో ఏ పన్నులైనా విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని నిపుణులు చెబుతున్నారు. గ్రామీణ స్థానిక సంస్థలు కొన్ని పన్నులు విధించుకుని వసూలు చేసుకోవచ్చని... పట్టణ స్థానిక సంస్థలకూ ఈ అధికారం ఉందంటున్నారు. కానీ కంపెనీ చట్టం కింద ఏర్పడ్డ కార్పొరేషన్లకు అసలు ఇలాంటి అధికారమే లేదని నిపుణులు చెబుతున్నారు. ఇలా మద్యంపై వసూలు చేసే పన్ను అయినా, మార్జిన్‌ అయినా ఖజానాకు వచ్చి.. అప్రాప్రియేషన్‌ బిల్లులో పొందుపరిచి అప్పుడు కార్పొరేషన్‌కు బదిలీ చేయాలి తప్ప.. నేరుగా కార్పొరేషన్‌ వసూలు చేసుకుని ఆదాయంగా వినియోగించుకోవడానికి వీల్లేదని అంటున్నారు.

ఇదీ చదవండి:

Jagananna Vidya Deevena: నేడు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.709 కోట్లు జమ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details