ఫిట్నెస్ లేని బస్సులపై ఉక్కుపాదం.. భారీగా కేసులు నమోదు - actions
నిబంధనలు పాటించకుండా విద్యార్థులను తరలిస్తున్న బస్సులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ముఖ్యమంత్రి ఆదేశాలతో అప్రమత్తమైన అధికారులు సరైన పత్రాలు లేని బస్సులు, ఆటోలు, డ్రైవర్లపై కేసులు నమోదు చేస్తున్నారు.
ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులపై రవాణాశాఖ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు .రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తనిఖీల్లో భాగంగా విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఆర్టీఏ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. స్కూల్ బస్సులు, ఆటోలను తనిఖీలు చేశారు. ఫిట్నెస్ లేని ఆటోలు, అధికంగా విద్యార్థులను తీసుకెళ్తున్న వాహనాలపై కేసులు నమోదుచేశారు. పాఠశాల బస్సుల్లో నిబంధనలు పాటించని డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 152 బస్సులపై కేసులు నమోదు చేసినట్లు డీటీసీ మీరా ప్రసాద్ తెలిపారు. 120 బస్సులను సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఆటోల్లో అధికంగా పిల్లలను తరలించే పాఠశాలల ప్రిన్సిపల్‌పై కేసు నమోదు చేసేందుకు వీలు కల్పించాలని పైఅధికారులను కోరనున్నామని తెలిపారు. ఏ చిన్న నిబంధన పాటించకపోయినా కేసు నమోదు చేస్తున్నామని మీరా ప్రసాద్ తెలిపారు.