జీహెచ్‌ఎంసీలోని 150 డివిజన్ల పరిధిలో 30 సర్కిళ్లు, 6 జోన్లున్నాయి. కోటి మందికిపైగా జనాభా ఉన్నారు. అక్రమ నిర్మాణాలు, వివాదాస్పద భూముల్లోని గుర్తింపులేని ఇళ్లను, అధికారిక నిర్మాణాలను కలిపితే 25 లక్షల భవనాలుంటాయి. రోడ్లు 9 వేల కిలోమీటర్లకుపైగా ఉన్నాయి. నగర శివారులో మరింత అభివృద్ధి జరుగుతోంది. జనాభా, నిర్మాణాల పెరుగుదల వేగంగా జరుగుతోంది. ఆమేరకు రాష్ట్రప్రభుత్వం ఇటీవల నగరం చుట్టూ కొత్త నగరపాలక సంస్థను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం గ్రేటర్ చుట్టూ 22 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ఉన్నాయి. ఇవేమీ జీహెచ్‌ఎంసీకి పట్టట్లేదు. కమిషనర్ కార్యాలయం నుంచి అదనపు కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారుల వరకు మెజార్టీ యంత్రాంగం విధి నిర్వహణను తేలిగ్గా తీసుకుంటోంది.
పని లేనట్లుగా..
*కమిషనర్‌తో కలిపి జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ముగ్గురు ఐఏఎస్ అధికారులున్నారు. వారిలో ఇద్దరు మధ్యాహ్నమయ్యాక కార్యాలయానికి వస్తారు. విభాగాలపై ఎలాంటి సమీక్షల్లేవు. క్షేత్రస్థాయి తనిఖీల్లేవు.
*అదనపు కమిషనర్ల హోదాలో 9 మంది పారిశుద్ధ్యం, ఆరోగ్యం, రెవెన్యూ, రవాణా, ఐటీ, న్యాయ, యూసీడీ, ఎలక్ట్రికల్, క్రీడలు, ఎస్టేట్స్, ఎన్నికలు, ఫైనాన్స్, పరిపాలన, ఇతరత్రా విభాగాలకు నేతృత్వం వహిస్తారు. ఏడాదిన్నరగా సగం విభాగాల్లో నూతన ఆవిష్కరణలు/పురోగతి లేదన్న విమర్శలున్నాయి.