Ganesh Chaturthi 2022: పనులకు, సిద్ధికి ఆటంకాలే విఘ్నాలు, విపత్తులే విఘ్నాలు... అంటూ శాస్త్ర నిర్వచనం. ఆ విఘ్నాలను తొలగించే దైవంగా వినాయకుడిని కొలుచుకొంటారు. సృష్ట్యాదిలో బ్రహ్మదేవుడి సృష్టి రచనా మహాకార్యానికి విఘ్నాలు కలిగినప్పుడు, అవి తొలగడానికై ఓంకారాన్ని జపిస్తూ, ఆ ప్రణవ తేజస్సును ధ్యానించాడని, ఆ తేజస్సే గజవదనంతో వక్రతుండ స్వరూపంగా దివ్యాకారంతో సాక్షాత్కరించిందని స్కందపురాణంలో, తాపినీయోపనిషత్తులో వర్ణించారు.
తిరిగి ఆ తేజస్సే శివపార్వతీ తనయుడిగా వ్యక్తమైందని పురాణోక్తి. బ్రహ్మదేవుడికి సాక్షాత్కరించినది మాఘ బహుళ చతుర్థినాడు. ఉమాశంకరులకు పుత్రుడై ఆవిర్భవించినది భాద్రపద శుద్ధ చతుర్థి. అందుకే రెండు చవితి తిథులను గణేశ ఆరాధనకు ప్రశస్తంగా భావిస్తారు. ఈ గణపతిని పరిపూర్ణపరబ్రహ్మ స్వరూపంగా ఉపాసించే యోగులు అత్యంత ప్రాచీన కాలంనుంచి ఉన్నారు. పురాణాలు, మంత్రశాస్త్రాలు వివిధ గణపతి మూర్తులు, మంత్రాల ఉపాసనా పద్ధతులను ఆవిష్కరించాయి. మహాగణపతి, బాలగణపతి, వీరగణపతి, శక్తిగణపతి, హేరంబ గణపతి, ఉచ్చిష్ట గణపతి, లక్ష్మీ గణపతి, నృత్య గణపతి, క్షిప్ర గణపతి... అంటూ 16 గణపతి మూర్తులను, మంత్రాలను ఆగమాలు అందించాయి. వాటిని ఉపాసించే సిద్ధపురుషులు, యోగులు నేటికీ ఉన్నారు. కాశీక్షేత్రంలో 56 పేర్లతో 56 గణపతులు ఉన్నారు. ఆ వివరాల్ని స్కాందపురాణం వర్ణించింది.
అనేక పురాణాల్లో గణపతి వైభవాన్ని వ్యాసుడు వర్ణించాడు. ప్రత్యేకంగా ‘గణేశ పురాణం’ అనే ఉప పురాణాన్ని రచించాడు. బ్రహ్మదేవుడి ద్వారా ఉపదేశాన్ని పొంది, గణేశ మంత్రాన్ని జపించి, వివిధ గ్రంథ రచనా శక్తిని తాను పొందినట్లుగా ఆ పురాణంలో వ్యాసుడు వివరించాడు. ముద్గల మహర్షి గణేశుడికి సంబంధించిన ఎన్నో విషయాలను ‘ముద్గల పురాణం’ అనే బృహత్ గ్రంథంగా తీర్చిదిద్దాడు. గణేశ భక్తులకు అవి పరమ ప్రమాణాలు. గాణాపత్యానికి కేంద్ర పీఠాలుగా మహారాష్ట్రలోని అష్టగణపతి క్షేత్రాలు విరాజిల్లుతున్నాయి. అవి పుణె పరిసరాల్లో నెలకొని ఉన్నాయి. ‘అష్ట వినాయక క్షేత్రయాత్ర’ పేరిట ప్రత్యేకంగా ఎందరో శ్రద్ధాళువులు వీటిని సందర్శిస్తుంటారు.