ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'శరీరంలోని ప్రతి అవయవంపై కరోనా ప్రభావం చూపుతుంది' - కొవిడ్​-19 తాజా వార్తలు

కరోనా ప్రారంభం నుంచి సేవలు అందిస్తూ... వేలాదిమంది ప్రాణాలను కాపాడింది గాంధీ ఆస్పత్రి. పసికందు మొదలుకొని.... వృద్ధుల వరకు వైరస్ నుంచి కోలుకునేలా చికిత్స అందించి అరుదైన గౌరవాన్ని సంపాదించుకుంది. కొవిడ్ రోగుల ప్రాణాలను కాపాడేందుకు చేస్తున్న సేవకు గాను త్రివిదదళాల గౌరవవందనాన్ని అందుకుంది. గాంధీలో చికిత్సల పట్ల సంతృప్తి ఉన్నా... సిబ్బంది తీరు సహా అనేక అంశాల విషయంలో విమర్శలను మూటగట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావుతో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

'శరీరంలోని ప్రతి అవయవంపై కరోనా ప్రభావం చూపుతుంది'
'శరీరంలోని ప్రతి అవయవంపై కరోనా ప్రభావం చూపుతుంది'

By

Published : Oct 31, 2020, 11:22 AM IST

'శరీరంలోని ప్రతి అవయవంపై కరోనా ప్రభావం చూపుతుంది'

ప్రశ్న: గత ఎనిమిది నెలలుగా కొవిడ్​తో పోరాడున్న రోగులకు సేవలు అందిస్తున్నందుకు ముందుగా అభినందనలు. మీరు చేస్తున్న సేవలకు గాను అరుదైన గౌరవం లభించింది. ప్రజల నుంచి మన్ననలు పొందటం ఎలా అనిపిస్తోంది?

జవాబు: ఇది ఒక రకంగా మాకు మంచి ప్రోత్సాహం. గతంలో ఏ ప్రభుత్వ ఆస్పత్రికి, వైద్యుడికి ఇలాంటి గౌరవం దక్కలేదు. ఇప్పటి వరకు గాంధీలో 25 వేల మందికి చికిత్స అందించాము. 15 వేల మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక వీరిలో సుమారు 5వేల మందికి ఐసీయూలో చికిత్స చేశాము. ఇంతటి సేవ వల్లనే ఈ అరుదైన గౌరవం దక్కిందనుకుంటున్నాను.

ప్రశ్న: దాదాపు 25 వేల మందికి చికిత్స అందించారు. అయితే ఇందులో ఎంతమంది గర్భిణి స్త్రీలు ఉన్నారు. ఆస్పత్రిలోనే ఎంతమంది ప్రవించారు?.. పుట్టిన పిల్లల్లో ఎవరికైనా కోవిడ్ సోకిందా.?

జవాబు. దాదాపు 800 మంది గర్భిణులకు గాంధీలో చికిత్స అందించాము. వీరిలో సుమారు 600 మంది వరకు కాన్పులు జరిగాయి. అందులో 400మందికి సీ సెక్షన్, 200 మందికి సాధారణ కాన్పులు చేశాము. మొత్తం పుట్టిన పిల్లల్లో కేవలం 2 శాతం అంటే దాదాపు ౩౦ మందికి పాజిటివ్ వైరస్ సోకింది.

ప్ర. అప్పుడే పుట్టిన పసికందులకు కరోనా చికిత్స ఇవ్వటంలో ఇబ్బందులు తలెత్తలేదా?

జ. చిన్నారుల్లో ఇలాంటి వ్యాధులు కొంత తక్కువ ప్రభావం చూపుతాయి. వైరస్ కారణంగా వచ్చే ఇతరత్రా సమస్యలను పరిష్కరించగలిగే... మరణాలను తగ్గించవచ్చు. ఇంత చేసినా కొందరు చిన్నారులు మృతి చెందారు కానీ చాలా తక్కువనే చెప్పాలి .

ప్ర. ప్రతి వైద్యుడు రోగిని కాపాడాలనుకుంటారు. అందులోనూ మీ గైనకాలజీ విభాగంకి పని ఒత్తిడి ఎక్కువ. ఇంత కష్టపడి పురుడుపోసిన బిడ్డ ప్రాణాలు పోయినప్పుడు వైద్యుడిగా ఎలాంటి బాధ ఉంటుంది?

జ. పసి కందు మాత్రమే కాదు.. ఓ మనిషి చనిపోతే ఆ కుటుంబానికి ఆ బాధ జీవితకాలం ఉంటుంది. ఇంత పెద్ద మహమ్మారిని ఎదుర్కొంటున్న సమయంలో ఇలాంటివి జరుగుతుంటాయి. ఇతర దేశాలతో పోలిస్తే మన దగ్గర వైరస్ తీవ్రత తక్కువగా ఉంది. దీంతో మరణాలు తక్కువగానే ఉన్నాయి.

ప్ర. నిజంగానే వైరస్ తీవ్రత తగ్గువగా ఉందా లేక మనం ఇచ్చే వ్యాక్సిన్ లు , తీసుకునే ఆహారంలో కూడా అనేక రకాల ఇమ్యునో బూస్టర్లు ఉంటాయి. వాటి ప్రభావం వల్ల వైరస్ తీవ్రత తక్కువగా ఉందనుకోవచ్చా?

జ. రెండు రకాల అంశాలు ఇక్కడ ఉంటాయి . ఏ వ్యాధిలో అయినా వైరస్ బలమైంది అయితే శరీరం మీద దాడి చేసే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. లేకపోతే శరీరమే వైరస్​ని వేగంగా అడ్డుకుంటుంది. భారత్ సహా ట్రాపికల్ దేశాల్లో వైరల్ ఇన్​ఫెక్షన్లు ఎక్కువ . దీంతో శరీరంలో కొవిడ్ యాంటీ బాడీలు లేనప్పటికీ వైరస్ ప్రభావం తక్కువగా ఉంది.

ప్ర. గత ఎనిమిది నెలలుగా కొవిడ్ సేవల్లో నిమగ్నమైన గాంధీలో ఎంతమంది సిబ్బంది వైరస్ బారినపడ్డారు. వారి చికిత్స గురించి తీసుకున్న జాగ్రత్తలేంటి?

జ. గాంధీలో సిబ్బందికి నాణ్యమైన పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులు, ముందుగా హెచ్​సీ క్యూ వాడటంతో పాటు... నిత్యం కేవలం 50శాతం మంది సిబ్బందికి మాత్రమే డ్యూటీలు వేయటం వల్ల మన దగ్గర ఇన్​ఫెక్షన్ రేటు తక్కువగా ఉంది. గాంధీలో కేవలం 60 నుంచి 70 మంది మాత్రమే ఇన్​ఫెక్షన్ బారిన పడ్డారు. ఇక వైరస్ సోకిన వారు కూడా త్వరగా కోలుకుని తిరిగి సేవలు అందించటం హర్షించాల్సిన విషయం.

ప్ర. కరోనా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహమ్మారే. అయితే కొవిడ్ సమయంలో సేవలు అందించటం వల్ల కొత్త నైపుణ్యాలు వస్తాయన్నది వాస్తవమే అయినా పీజీ వైద్య విద్యార్థులకు వారి విభాగాల్లో కూడా నైపుణ్యం రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తాము నష్టపోయామని జూడాలు చెబుతున్నారు. దీనిపై మీరేమంటారు?

జ. భారతదేశ వ్యాప్తంగా విద్యా వ్యవస్థ దాదాపుగా స్తంభించింది. ఇప్పటి వరకు కాలేజీలే ప్రారంభం కాలేదు. మెడిసిన్ లో కూడా గాంధీ ఆస్పత్రి మాత్రమే కొవిడ్ సేవలకు అంకితమైంది. అయినా మిగతా ఆస్పత్రుల్లో కూడా ఎలక్టివ్ సర్జరీలు, ఓపీ సేవలు గణనీయంగా తగ్గాయి. ఓపీలు అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇలాంటి మహమ్మారి ఉన్నప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్లపై కూడా కొంత ప్రభావం ఉంటుంది. ఇందులో భాగంగా సాధ్యమైనంత త్వరగా గాంధీని నాన్ కొవిడ్​గా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ప్ర. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. కమిటీ వేశారు. ప్రస్తుతం గాంధీలో ఎంతమంది కొవిడ్ రోగులు ఉన్నారు.. ఆ కమిటీ నివేదికలు ఏం చెబుతున్నాయి?

జ. కొవిడ్ , నాన్ కొవిడ్ సేవల్లో వస్తున్న ప్రధాన సమస్య ఐసోలేషన్. సరైన ఐసోలేషన్ లేకపోతే క్రాస్ ఇన్​ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉంది. అందులో భాగంగా కొవిడ్ కేసులు ఉంచేందుకు ప్రత్యేక బ్లాకులను గుర్తించాము. ప్రస్తుత ఆస్పత్రిలో 350మంది రోగులు ఉన్నారు. అందులో 250 మంది ఐసీయూలోనే ఉన్నారు. కేసులు మరింత తగ్గితే నాన్ కొవిడ్ సేవలను సైతం ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నాము.

ప్ర. కొవిడ్ ప్రారంభమైనప్పటి నుంచి టెస్టింగ్, ప్లాస్మా థెరపీకి సంబంధించిన ఏర్పాట్లు గాంధీలో జరిగాయి. ఇటీవల గాంధీలో అభివృద్ధి చేసిన ఇన్​ఫ్రాస్ట్రక్చర్ గురించి వివరిస్తారా ?

జ. గతంలో గాంధీలో కేవలం 150 ఐసీయూ పడకలే ఉండేవి.. ఇప్పుడు దాదాపు 600వరకు సమకూరాయి, మరో 1000 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం ఉంది, వెంటిలేటర్​లు సైతం 120 నుంచి 400కి పెరిగాయి, సుమారు 400 వరకు మల్టీ ఛానల్ మానిటర్స్​ సమకూరాయి. సీప్యాప్ మిషన్లు సహా అన్ని రకాల ఐసీయూ పరికరాలు ఇప్పుడు గతంతో పోలిస్తే రెండు రెట్లు అదనంగా అందుబాటులోకి వచ్చాయి.

ప్ర. కొవిడ్ ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపుతుందని మొదటి నుంచి అనుకున్నాం. కానీ ఇతర రకాల శరీర భాగాలపై కూడా ప్రభావం చూపుతుందని డబ్ల్యూహెచ్​వో కూడా చెబుతోంది. ఎక్కువ మంది రోగులను దగ్గరగా చూసిన అనుభవం మీది. ఈ నేపథ్యంలో దీని గురించి మీరేమంటారు?

జ. కొవిడ్ కేవలం ఊపిరితిత్తులకే పరిమితం అవుతుందనుకోవటం సరికాదు. గుండె, కిడ్నీ, కాలేయం, మెదడు వంటి అన్ని ప్రధాన శరీర భాగాలపై ప్రభావం చూపుతోంది .

ప్ర. కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో సైటోకైనిన్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. అసలు ఇది ఎందుకు వస్తుంది... దీనిని ఎలా అరికట్టవచ్చు?

జ. సాధారణంగా ఎలాంటి వైరస్ అయినా శరీరంలో ప్రవేశిస్తే ఇమ్యూనిటీ సిస్టం దానిని చంపేయాలని చూస్తుంది. ఇందులో భాగంగా ఇన్​ఫ్లమేటరీ మీడియోటర్లు రిలీజ్ అవుతాయి. అయితే కరోనాకు మాత్రం ఇవి ఎక్కువగా విడుదల అవుతున్నాయి. ఆ ఇన్​ఫ్లమేటరీ మీడియోటర్లలో ఓ రకమే సైటోకైనిన్​లు . అవి వరదలా రావటం వల్ల వైరస్​తో పాటు.. శరీరంలోని వివిధ భాగాలు దెబ్బతింటున్నాయి. రక్తం గడ్డ కట్టే సమస్యలు వస్తున్నాయి. గుండెరక్త నాళాలు బ్లాక్ అవ్వటం, మెదడుకు వెళ్లే రక్త నాళాల్లో బ్లాక్​లు ఏర్పడటం వల్ల ఆయా భాగాలు దెబ్బతింటున్నాయి.

ప్ర. సైటోకైనిన్ స్ట్రోమ్​కి పరిష్కారం లేదా?

జ. స్టెరాయిడ్స్​ని వాడటం ద్వారా సమస్యను కొంత పరిష్కరించవచ్చు. రక్తాన్ని పల్చబరిచేందుకు యాంటీ కోయాగ్యులెంట్స్​ని వాడుతున్నాము.

ప్ర. కొవిడ్ ప్రారంభంలో రోగులకు ఇచ్చిన యాంటీ వైరల్, యాంటీ బయోటిక్ మందులు సరిగా పనిచేయటం లేదని డబ్ల్యూహెచ్​వో ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో కరోనా చికిత్సల్లో ఏమైనా మార్పులు వచ్చాయా?

జ. వ్యాధిపై ఇప్పుడు అవగాహన పెరిగింది. వైరస్ సోకాక ఏ దశలో ఏమవుతుందన్న విషయాలు ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. ఈ మందులను సరైన సమయంలో ఇవ్వాలి. పాజిటివ్ వచ్చిన వెంటనే యాంటీ వైరల్ డ్రగ్స్​ ఇస్తే బాగా పనిచేస్తాయి. కానీ సైటోకైనిన్ స్ట్రోమ్ ప్రారంభమయ్యాక అంటే వైరస్ సోకిన రెండు, మూడు వారాల్లో ఈ మందులు ఇవ్వటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. రెండు మూడు వారాల్లో స్టెరాయిడ్స్ ఇస్తే ఫలితం ఉంటుంది.

ప్ర. మందులతోపాటు... చాలా మంది ప్లాస్మా థెరపీని నమ్మారు. అయితే ప్లాస్మా థెరపీ ఆశించిన ఫలితాలు ఇచ్చిందనుకుంటున్నారా?

జ. ఫ్లాస్మా థెరపీ సంజీవని కాదు. ఓ రకం ట్రీట్మెంట్ అంతే. అయితే ప్లాస్మా తెరపీ అనుకున్న స్థాయిలో ఫలితాలను మాత్రం ఇవ్వలేదు.

ప్ర. రాష్ట్రంలో కేసులు కొంత తగ్గినట్టు కనిపిస్తోంది. అయితే ఇతర దేశాల్లో సెకండ్ వేవ్ ప్రారంభమైంది. ఫ్రాన్స్ వంటి దేశాలు లాక్​డౌన్​ని ప్రకటించాయి. మన దేశంలో అలాంటి దాఖలాలు ఉన్నాయా?

జ. ప్రజల తీరులో మార్పురాకపోతే... సెకండ్ వేవ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ప్రజలకు వైరస్ పట్ల భయం పోయింది. మాస్కులు వాడటం లేదు.. శానిటైజర్ వాడటం లేదు. సెకండ్ వేవ్ అనేది వైద్యులు, ప్రభుత్వాల చేతుల్లో ఉండదు. ప్రజల చేతుల్లోనే ఉంటుంది. ఇంకో మూడు నెలలు జాగ్రత్తగా ఉంటే సెకండ్ వేవ్ రాకుండా చూసుకోవచ్చు.

ప్ర. రాబోయేది చలికాలం వైరస్ మరింత ప్రభలే అవకాశం ఉన్న సమయం. ఈ సమయంలో ఇలా మాస్కుల వినియోగం తగ్గటం ఏ మేరకు ప్రమాదకరమంటారు?

జ. ప్రజలు వైరస్ వస్తే పెద్దగా ప్రమాదం లేదనుకుంటున్నారు. మరణాలు తక్కువగా ఉండటం ఇందుకు ఓ కారణం. కానీ కరోనా ఇతర శరీర భాగాలపై తీవ్ర ప్రభావం చూపటం వల్ల అది దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందన్న విషయాన్ని గుర్తించాలి. గతంలో గాంధీలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయినవారు... ఐసోలేషన్ లో ఉన్నవారు... ఇప్పుడు రక్తనాళాలు బ్లాక్ అయ్యి, గుండె సమస్యలతో ఆస్పత్రులకు వెళ్తున్నారు. దాదాపు 20 శాతం మంది ఇతర రకాల అవయవాల సమస్యలతో ఆస్పత్రులకు వెళ్తున్నారు.

ప్ర. గాంధీ విషయానికి వస్తే ... ఎంతటి మంచి కీర్తి వచ్చిందో... ఇప్పుడు అదే స్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి. సిబ్బంది రోగుల తో అసభ్యంగా ప్రవర్తించటం, రోగుల వస్తువులు మాయం అవటం వంటివి ఎలా చూడవచ్చు.?

జ .రోగుల వస్తువులు మాయం అవటం, సిబ్బంది రోగులతో అసభ్యంగా ప్రవర్తించటం వంటి ఘటనలు జరిగిన మాట వాస్తవం. కొవిడ్ సమయంలో ఉన్న సిబ్బంది సరిపోక... పేషెంట్ కేర్ ప్రొవైడర్లను చాలా మంది కొత్తవారిని తీసుకున్నాము. ఇందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు సైతం ఉన్నారు. ఒకసారి పీపీఈ కిట్లు వేసుకున్నాక ఎవరు ఎవరో అర్థం కాదు. దీంతో ఇలాంటి ఘటనలు జరిగాయి. అలాంటి వారిని సీసీ కెమెరాల సహాయంతో పట్టుకుని దాదాపు 20 మందిని విధుల నుంచి తొలగించటంతోపాటు.... కేసులు పెట్టాము. ఇప్పుడు సమాచారం కేంద్రం ఏర్పాటు చేసి విలువైన వస్తువులు ఆస్పత్రికి తీసుకురావద్దని చెబుతున్నాము. ఎవరైనా తీసుకువచ్చినా వాటిని సేకరించి భద్రపరుస్తున్నాము. డిశ్చార్జ్ సమయంలో తిరిగి అందిస్తున్నాము.

ప్ర. ఒక సిబ్బంది కొవిడ్ రోగితో అసభ్యంగా ప్రవర్తించటం, ఫుడ్ సప్లై మీద విమర్శలు, మద్యం తాగి సిబ్బంది హల్ చల్ చేసిన ఘటనలు వెలుగు చూశాయి. ఇందులో అడ్మినిస్ట్రేషన్ లోపం ఉన్నట్టు కనిపిస్తోంది. దీనిపై మీరేమంటారు?

జ. ఆహారానికి సంబంధించి ఓ కమిటీ వేశాము. డైటీషియన్ ఉంటారు. క్వాలిటీలో రాజీ లేకుండా చర్యలు తీసుకుంటున్నాము. కొన్ని విమర్శలు ఉన్న మాట వాస్తవం. తాగి హల్ చల్ చేసిన వార్తలో వాస్తవం లేదు. ఈ ఘటనపై ఓ కమిటీ వేశాను అందులో మద్యం సేవించారని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని తేలింది. చనిపోయిన వ్యాక్తి కూడా మద్యం సేవించ లేదు.. గుండె జబ్బుతో చనిపోయారు.

ప్ర. ఎంతోమంది రోగులకు చికిత్స చేసి ఉంటారు. కొవిడ్ రోగులకు సేవ చేయటం ఒక ఎత్తు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ప్రాణం కాపాడటం గాంధీకి అరుదైన అవకాశం అనుకున్న ఘటనలు వివరిస్తారా?

జ. కొవిడ్ సోకి ఆస్పత్రిలో చేరిన వారిలో 5 వేల మంది ఐసీయూ నుంచి కోలుకున్నారు. రెండు కిడ్నీలు చెడిపోయిన వారు, గుండె జబ్బులు ఉన్నవారు, అప్పుడే పుట్టిన పసికందు మొదలుకొని.... 103 ఏళ్ల వాళ్ల వరకు అందరికీ చికిత్స చేశాము. మహమ్మారి నుంచి కోలుకుని అలాంటి వారు డిశ్చార్జ్ అవుతున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది.

ఇవీ చూడండి: భారత్​లో 6 లక్షల దిగువకు యాక్టివ్​ కేసులు

ABOUT THE AUTHOR

...view details