''ఇన్నాళ్లూ మాడిన కడుపులు.. వారోత్సవాలతో నిండుతాయా?''
ఇసుక పంపిణీ వ్యవహారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తప్పుబట్టారు. 5 నెలలుగా మాడిన కడుపులు.. ఇసుక వారోత్సవాలతో నిండుతాయా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
వైకాపా ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల్లో నవరత్నాలను పక్కనపెట్టి శాండ్ హాలిడే ప్రకటించారని మాజీ మంత్రి సోమిరెడ్డి మండిపడ్డారు. మే 30 నుంచి సెప్టెంబర్ 5 వరకు ఇసుకను తాకనీయలేదని... ఇప్పుడు ఇసుక వారోత్సవాలు ఎందుకు జరుపుతున్నారని విజయవాడలో ప్రశ్నించారు. తాపీ మేస్త్రీల నుంచి సిమెంట్ కంపెనీల వరకు ఎవరికీ పని లేకుండా చేశారని దుయ్యబట్టారు. ఐదు నెలలుగా పనిలేక మాడిన కడుపులు.. ఇసుక వారోత్సవాలతో నిండుతాయా అని నిలదీశారు. ప్రభుత్వం కొత్త విధానం ప్రకటించే వరకు గత ప్రభుత్వ హయాంలో అమలులో ఉన్న ఉచిత ఇసుక విధానాన్ని కొనసాగించాల్సిందే అని ఆయన డిమాండ్ చేశారు. ఇసుక విషయంలోనే సరైన నిర్ణయం తీసుకోలేని వారు మిగిలిన కీలక విషయాల్లో ఏం చేస్తారని ప్రశ్నించారు.