ప్రాథమిక విద్యను మాతృభాషలోనే కొనసాగించాలని, మహాత్మాగాంధీ సైతం ఇదే విషయాన్ని చెప్పారని మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కె.చంద్రు అన్నారు. కానీ బ్రిటిష్ వారసత్వం, విదేశాల్లో ఉద్యోగాల కోసం చాలామంది ఆంగ్లం వైపు మళ్లుతున్నారని వివరించారు. విజయవాడలో భారత పాఠశాల ఉపాధ్యాయుల సమాఖ్య (ఎస్‌టీఎఫ్‌ఐ) జాతీయ మహాసభలను శుక్రవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘దేశంలో విద్య వినియోగ వస్తువుగా మారింది. 14 ఏళ్ల లోపు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలని చెబుతూనే ప్రైవేటు వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారు. విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటులో చేరే 25 శాతం మంది విద్యార్థులకు, ఇతర విద్యార్థులకు విడివిడిగా తరగతులు నిర్వహిస్తున్నారు’ అని ఆరోపించారు. కర్ణాటకలో హిజాబ్ గొడవ కారణంగా 20 వేల మంది అమ్మాయిలు పరీక్షలు రాయలేదని, భాజపా దక్షిణాదిలోనూ మతవిద్వేషాలను తీసుకొచ్చిందని విమర్శించారు. ‘విద్య అనేది ప్రాథమిక హక్కు అని తీర్పు చెప్పిన న్యాయస్థానాల్లోనే ప్రైవేటీకరణకు అనుకూలంగా తీర్పులు వచ్చాయి’ అని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సదుపాయాలు కల్పిస్తున్నా తల్లిదండ్రులు పిల్లల్ని ఎందుకు ప్రైవేటు బడులకు పంపిస్తున్నారనే దానిపై ఉపాధ్యాయులు ఆలోచించాలని సూచించారు.