Godavari Floods: ఎగువన కురుస్తున్న భారీవర్షాల కారణంగా గోదావరి వరద ఉద్ధృతి పెరుగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 11.79 లక్షల క్యూసెక్కులు ఉందని ఉదయానికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని వెల్లడించారు. విపత్తు నిర్వహణా సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ సంబంధిత జిల్లాల కలెక్టర్లకు సూచనలు జారీ చేస్తున్నామన్నారు. రెండవ హెచ్చరిక వస్తే ప్రభావితం కానున్నమండలాలపై జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని చెప్పారు.
సహాయ చర్యల్లో మొత్తం ఆరు బృందాలు ఉన్నట్లు అంబేడ్కర్ తెలిపారు. కోనసీమ జిల్లాలో ఒక ఎన్డీఆర్ఎఫ్, 2 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక ఎన్డీఆర్ఎఫ్, ఒక ఎస్డీఆర్ఎఫ్, ఏలూరు జిల్లాలో ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందం ఉన్నట్లు వెల్లడించారు. గోదావరితో పాటు కృష్ణా, తుంగభద్ర నదులు ఉద్ధృతంగా ఉన్నందున నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.