పంచాయతీ, ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన ‘పార్టీ’ రంగుల్ని తొలగించి కొత్త రంగులేశాకే స్థానిక సంస్థల ఎన్నికల్ని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ ఎత్తేశాక మూడు వారాల్లో ఈ పని చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాలకు రాజకీయ పార్టీ జెండాల రంగులు వేయడానికి వీల్లేదని హైకోర్టు ఇదివరకే తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు అమలుకు మరికొంత గడువు కావాలని ప్రభుత్వం హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీనిపై విచారణ జరిపింది. అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సుమారు 10831 ప్రభుత్వ భవనాలకు రంగులు తొలగించాల్సి ఉందని, నాలుగు వారాలు గడువు కావాలని కోరారు. అంత సమయం ఎందుకని ధర్మాసనం ప్రశ్నించింది. భవనాలన్నింటికీ ఒక్కరితో రంగులేయించడం లేదు కదా అని వ్యాఖ్యానిస్తూ...మూడు వారాల గడువిచ్చింది. ప్రభుత్వం తీసుకున్న చర్యల వివరాల్ని కోర్టుకు నివేదించాలని ఆదేశించింది.
సగం పింఛనుపై విచారణ వాయిదా
విశ్రాంత ఉద్యోగులకు సగం పింఛనుపై విచారణ వాయిదా.. కరోనా పరిస్థితుల దృష్ట్యా విశ్రాంత ఉద్యోగులకు 50 శాతం పింఛను ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంలో విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది. ఈ విషయంలో ప్రభుత్వానికి ఉన్న అధికారాలు, పింఛను చట్ట నిబంధనల వివరాలతో ఈనెల 23 నాటికి అదనపు కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది.