హమ్మయ్య!..విజయవాడలో 'చెత్త' సమస్యకు స్వస్తి! విజయవాడ నగర వాసులను ఏళ్ల నాటి నుంచి వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి చెత్త సమస్య. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వందల మంది సిబ్బందిని నియమించి ఎప్పటికప్పుడు చెత్తను తరలిస్తున్నా... నేటికీ అదే సమస్య అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా... బయోమైనింగ్ పద్ధతిలో చాలా వరకు అధికారులు చెత్తను నిర్వీర్యం చేశారు. మిగిలిన చెత్తనూ తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
శాశ్వత పరిష్కారానికి కృషి
నగరంలో 59 వార్డులు ఉండగా.... ప్రస్తుతం 31 వార్డుల్లో మున్సిపల్ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి తడిపొడి చెత్తను సేకరిస్తున్నారు. అయితే వచ్చే నెల 15 నాటికి మిగిలిన వార్డుల్లోనూ పూర్తి స్థాయిలో తడి పొడి చెత్తను సేకరించేందుకు ప్రయత్నిస్తామని నగరపాలక సంస్థ అధికారులు చెబుతున్నారు. మరోవైపు దీనికి సమాంతరంగా చెత్తను డంపింగ్ యార్డు నుంచి తరలించే ప్రక్రియ కొనసాగనుంది. విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో ఇకపై చెత్తను డంపింగ్ యార్డులకు తరలించడం కాకుండా ఇందుకోసం శాశ్వత పరిష్కారం దిశగా అధికారులు ప్రణాళిక రచిస్తున్నారు. గుంటూరులో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పూర్తైన తర్వాత... విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని అజిత్ సింగ్ నగర్ డంపింగ్ యార్డుకు తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
డంపింగ్ యార్డులో మొత్తం చెత్తను తొలగించిన తర్వాత....ఈ స్థలంలో ప్లాస్టిక్ రీసైకిల్ పార్కు ఏర్పాటు చేసేందుకు సైతం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికను ప్రభుత్వానికి నివేదించి...త్వరలోనే అనుమతులు తీసుకుని పనులు ప్రారంభించనున్నారు.