కొవిడ్ దెబ్బకు రాష్ట్రంలోని రైల్వేస్టేషన్లు వెలవెలబోతున్నాయి. ఇప్పటికీ వందలాది రైళ్లు షెడ్లకే పరిమితమయ్యాయి. నిత్యం వందలాది రైళ్లలో రద్దీగా ఉండే విజయవాడ జంక్షన్.. ఈసారి పండగ వేళల్లోనూ ఖాళీగా కనిపిస్తోంది. అన్‌లాక్ తర్వాత అతి కొద్ది సంఖ్యలోనే ప్రత్యేకరైళ్లు నడుస్తున్నాయి. దసరా పండుగకైనా అన్ని రైళ్లు పట్టాలెక్కుతాయని ఆశించిన ప్రయాణికుల కోరిక నెరవేరలేదు. సీజన్ మొత్తానికి కలిపి కేవలం 61 రైళ్లను మాత్రమే నడిపారు. ఒకట్రెండు ప్లాట్‌ఫాంలు మినహా మిగతావన్నీ ఖాళీగా మారాయి.
విజయవాడ నుంచి హైదరాబాద్, విశాఖ, ఉభయగోదావరి జిల్లాలకు వెళ్లే రైళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఆర్టీసీ బస్సులు కూడా సరైన సంఖ్యలో లేనందున ప్రైవేటు వాహనాల వాళ్లు దండుకుంటున్నారు. తక్కువ ఛార్జీతో ప్రయాణించే సౌలభ్యం కారణంగా చాలా మంది రైళ్లపైనే ఆధారపడ్డారు. రద్దీగా ఉండే మార్గాల్లో తగినన్ని రైళ్లు లేక వారికి ప్రయాణపాట్లు తప్పడం లేదు..