ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడకు రెండు అత్యాధునిక సరకు రవాణా నడవాలు

దేశంలో సరుకు రవాణా ద్వారా ఆదాయం పెంచుకోవటంతో పాటు.. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేలా వచ్చే ఏడాది కార్యాచరణ రూపొందించుకున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా మూడు డెడికేటెడ్ ఫ్రైట్‌ కారిడార్లు, ఏడు హైస్పీడ్‌ రైల్‌ కారిడార్ల ఏర్పాటుకు సంబంధించిన కార్యాచరణ సిద్ధమైనట్లు రైల్వే బోర్డు ఛైర్మన్‌ వినోద్‌ కుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు.

train
train

By

Published : Dec 27, 2020, 8:09 AM IST

వచ్చే ఏడాది డిసెంబరుకల్లా దేశంలో సరకు రవాణాకు సంబంధించి అత్యాధునిక సాంకేతికతతో మూడు డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్లు, ప్రయాణికుల పరంగా ఏడు హైస్పీడ్‌ రైల్‌ కారిడార్ల డీపీఆర్‌లు సిద్ధం చేయనున్నట్లు రైల్వేబోర్డు ఛైర్మన్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు. ఆయన శనివారం దిల్లీలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రైల్వేశాఖ 2020లో సాధించిన విజయాలను, 2021లో చేపట్టబోయే కార్యాచరణను వివరించారు.

డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్ల(సరకు రవాణా నడవాలు)లో ఖరగ్‌పుర్‌ - విజయవాడల మధ్య ఈస్ట్‌కోస్ట్‌ కారిడార్‌, విజయవాడ - ఇటార్సీ మధ్య నార్త్‌ సౌత్‌ సబ్‌కారిడార్‌ ఉన్నట్లు వినోద్ కుమార్ వెల్లడించారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌) తయారుచేయబోయే ఏడు హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లలో ముంబయి - పుణె - హైదరాబాద్‌ మార్గం ఉన్నట్లు వినోద్‌కుమార్‌ తెలిపారు. డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌కు సంబంధించి ప్రాథమిక నివేదిక సిద్ధమైందన్నారు. ఒకసారి డీపీఆర్‌ పూర్తయితే ఈ మార్గాల ద్వారా లభించే ఆదాయం(రేట్‌ ఆఫ్‌ రిటర్న్‌)పై స్పష్టత వస్తుందన్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఈ నడవాలలో అది 25 శాతం వరకు వచ్చే అవకాశం ఉన్నట్లు తేలిందని యాదవ్‌ పేర్కొన్నారు. దీనికితోడు ఏడు మార్గాల్లో సెమీ హైస్పీడ్‌, హైస్పీడ్‌ రైళ్ల కోసం సర్వే చేస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్‌ నాటికి డీపీఆర్‌ పూర్తయ్యాక ఇందులో ఒక్కో సెక్షన్‌ను పూర్తిగా విశ్లేషించి ఎక్కడ ఏ కారిడార్‌ చేపట్టాలో నిర్ణయిస్తామన్నారు. నేషనల్‌ రైల్‌ ప్లాన్‌పై ప్రజాభిప్రాయాన్ని సేకరించాక జనవరిలో దాన్ని ఖరారుచేస్తామన్నారు.

త్వరలోనే వందే భారత్‌ రైళ్ల టెండర్ల ఖరారు..
వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు సంబంధించి టెండర్లు తెరిచామని, జనవరిలో వాటిని ఖరారుచేసి మూడు కోచ్‌ ఫ్యాక్టరీల్లో ఆ రైళ్లను తయారుచేయాలని నిర్ణయించినట్లు వినోద్‌కుమార్‌ యాదవ్‌ చెప్పారు. దేశంలో హైపర్‌లూప్‌, మ్యాగ్నెటివ్‌ లెవిటేషన్‌ సాంకేతికత వినియోగంపై నీతి ఆయోగ్‌ అధ్యయనం చేస్తోందన్నారు. రాబోయే హైస్పీడ్‌ కారిడార్లలో ఏ దేశ సాంకేతికత అవలంబించేదీ డీపీఆర్‌ పూర్తయ్యాక నిర్ణయం తీసుకుంటామన్నారు. ముంబయి-అహ్మదాబాద్‌ హైస్పీడ్‌(బుల్లెట్‌) రైలు మార్గంలో ఇప్పటివరకు 68% భూసేకరణ పూర్తయిందన్నారు. గుజరాత్‌ పరిధిలో ప్రక్రియ కొలిక్కి వచ్చినందున అక్కడ 325 కిలోమీటర్లకు సంబంధించిన రూ.32వేల కోట్ల విలువైన సివిల్‌ కాంట్రాక్ట్‌లను ఖరారుచేసినట్లు యాదవ్‌ వివరించారు. మహారాష్ట్ర సర్కారు వచ్చే నాలుగు నెలల్లో భూసేకరణను పూర్తిచేయనున్నట్లు స్పష్టీకరించిందని ఆయన పేర్కొన్నారు.

2021కల్లా డీపీఆర్‌ పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఫ్రైట్‌ కారిడార్లు
1. ఈస్ట్‌కోస్ట్‌ కారిడార్‌- ఖరగ్‌పుర్‌- విజయవాడ- 1,115 కి.మీ.
2. ఈస్ట్‌ వెస్ట్‌ సబ్‌కారిడార్‌- భుసావల్‌-నాగ్‌పుర్‌-ఖరగ్‌పుర్‌-ఢంకుని- 1,673 కి.మీ.
3. నార్త్‌ సౌత్‌ సబ్‌కారిడార్‌- విజయవాడ-ఇటార్సీ- 975 కి.మీ

  • సంబంధిత భూసేకరణ రైల్వే చేపడుతుంది. ప్రాజెక్టులను పీపీపీ/హైబ్రిడ్‌ యాన్యుటీ/వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ పద్ధతిలో చేపడుతుంది.

2021 చివరికి డీపీఆర్‌ పూర్తిచేయాలని తలపెట్టిన హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లు
1. దిల్లీ-ఆగ్రా-వారణాశి- 865 కి.మీ.
2. వారణాశి-పట్నా-హావ్‌డా- 760 కి.మీ.
3. దిల్లీ-జైపుర్‌-అహ్మదాబాద్‌- 886 కి.మీ
4. దిల్లీ-చండీగఢ్‌-అమృత్‌సర్‌- 459 కి.మీ.
5. ముంబయి-నాసిక్‌-నాగ్‌పుర్‌- 753 కి.మీ.
6. ముంబయి-పుణె-హైదరాబాద్‌- 771 కి.మీ.
7. చెన్నై-బెంగళూరు-మైసూరు- 435 కి.మీ.

  • ఈ ప్రాజెక్టులకు రైల్వే భూసేకరణ చేపడుతుంది. పీపీపీ విధానంలో ఆర్థిక వనరులు సమకూరుస్తుంది.

రైల్వేశాఖ నిర్దేశించుకున్న మరికొన్ని లక్ష్యాలు

  • దిల్లీ-చెన్నై మార్గంతో పాటు, స్వర్ణ చతుర్భుజి విభాగంలో రైళ్ల వేగం 2021 డిసెంబర్‌ కల్లా 130 కిలోమీటర్లకు పెంపు
  • విశాఖ రేవుతో రాయ్‌పుర్‌-టిట్లాగఢ్‌ మా ర్గాన్ని అనుసంధించే ప్రాజెక్టు 2021కల్లా పూర్తి

ఇదీ చదవండి

బ్యాంకుల ఎదుట చెత్త వేయడంపై విచారణ

ABOUT THE AUTHOR

...view details