రాష్ట్రంలో 2.62 లక్షల టిడ్కో గృహాలను లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. ఈ నెల 25న.. 30.75 లక్షల ఇళ్ల పట్టాలను ప్రభుత్వం పంపిణీ చేస్తోందని వెల్లడించారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల 65 వేల 987 ఇళ్ల స్థలాలపై కోర్టు కేసులు ఉన్నాయన్నారు. ఇళ్ల స్థలాల కోసం 68 వేల 361 ఎకరాలను సేకరించినట్లు కొడాలి స్పష్టం చేశారు. ఈ భూముల విలువ రూ.23 వేల 535 కోట్లు ఉంటుందన్నారు.
కోర్టు కేసుల కారణంగా ఇళ్లస్థలాలు ఇవ్వలేకపోతున్న ప్రాంతాల్లో ఎంపికైన లబ్ధిదారులకు కేసులు పరిష్కారమైన వెంటనే పట్టాలు ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. 25న పట్టాల పంపిణీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 15.6 లక్షల ఇళ్ల నిర్మాణాలను కూడా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 8,914 ఇళ్ల చొప్పున నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు. రెండో దశలో 12.7 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించి.. వచ్చే మూడేళ్ళలో 28.3 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసిందన్నారు.