కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించి విజయవంతంగా అమలు చేస్తున్నాయి. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ కరోన వైరస్ అత్యంత ప్రమాదకరమైనది కావడం వల్ల..ప్రజలు ఒకరినొకరు కలువడానికి కూడా భయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో తప్పనిసరి అంటేనే జనం బయటకు వెళ్తున్నారు...అవసరమైనవి మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఏటీఎంలో నగదు తీసుకోడానికి, నగదు లావాదేవీలపై ఎక్కువ ఆసక్తి చూపడం లేదు.
చెల్లింపులన్నీ ఆన్లైన్లోనే..
ఇంటి అద్దె, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, మొబైల్ రీఛార్జిలు, గ్యాస్ బుకింగ్స్, డీటీహెచ్ బిల్లులు, ఇంటర్నెట్ బిల్లులు, ఆహారం, ఔషధాలు, పాలు, కూరగాయలు, పండ్లు, నిత్యావసర సరకుల కొనుగోలుకు నగదు బదులు క్రెడిట్, డెబిట్ కార్డులను, పే-టీఎం, గూగుల్‌పే లాంటి వ్యాలెట్లను కూడా వాడుతున్నారు. లాక్‌డౌన్‌కు ముందు వాడకంతో పోలిస్తే... క్రిడెట్, డెబిట్ కార్డుల వాడకం 50శాతం పెరిగాయి. స్థానిక దుకాణాలల్లో ఉపయోగించే పాయింట్-ఆఫ్-సేల్ మెషీన్లలో, ఆయా వ్యాపారికి చెందిన వ్యాలెట్ల ద్వారా ఆన్‌లైన్ చెల్లింపులు జరుగుతున్నాయి.
డిజిటల్కే మొగ్గు
బ్యాంకులు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ వంటివి కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌ను ప్రోత్సహిస్తున్నాయి. అమెజాన్, బిగ్‌బాస్కెట్, స్విగ్గీ, జొమాటో, గ్రోఫర్స్ లాంటివి నగదుతో కూడిన డెలివరీలను దాదాపుగా నిలుపేశాయి. లాక్‌డౌన్‌కు ముందు రోజువారీ లావాదేవీల్లో నగదు లావాదేవీలు 40శాతం ఉండేవని ఆయా సంస్థలు చెబుతున్నాయి. లాక్‌డౌన్ అమలును దృష్టిలో ఉంచుకుని ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో 42శాతం భారతీయులు డిజిటల్ లావాదేవీల ద్వారా చేస్తున్నట్లు వెల్లడైంది.