ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 10, 2021, 6:51 AM IST

Updated : Mar 10, 2021, 10:28 AM IST

ETV Bharat / city

పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్.. వరదార్పణం

గోదావరి వరదలతో కోసుకుపోయిన పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్‌ను సరిదిద్దేందుకు చాలా సమయం పట్టేలా కనిపిస్తోంది. 200 మీటర్ల పొడవున కొట్టుకుపోయిన గోడను 4 నుంచి 8 మీటర్ల లోతు వరకు సరిదిద్దాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. పోలవరంలో డయాఫ్రం వాల్‌ కీలక నిర్మాణం అయినందున పూర్తిస్థాయిలో పరిశీలించాల్సి ఉందని అధికారులు అంటున్నారు.

diaphragm wall Damaged at polavaram
ధ్వంసమైన డయాఫ్రం వాల్

పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్‌ గతంలో గోదావరి వరద ఉద్ధృతికి ధ్వంసమైంది. గోడ నిర్మించాక గోదావరికి 2 పెద్ద వరదలు పోటెత్తగా ఆ ప్రభావం తగ్గాక ఇటీవల విషయం వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలో రామయ్యపేట వైపు కొంతమేర, తూర్పు గోదావరి జిల్లాలో అంగులూరు వైపు చాలావరకు కొట్టుకుపోయింది. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని అమెరికాకు చెందిన బ్యూరో ఆఫ్‌ రిక్లమేషన్‌ సంస్థ నిపుణులు దశాబ్దాల కిందట సందర్శించి గోదావరిపై కాంక్రీటు నిర్మాణం కష్టమని తేల్చారు.

నదిలో వందల మీటర్ల మేర ఇసుక పొరలు మేటవేశాయని.. వాటి దిగువన ఎక్కడో రాతిపొరలు ఉండటమే ఇందుకు కారణమన్నారు. అందువల్ల ప్రత్యామ్నాయ ప్రణాళికలో భాగంగా నది ప్రవాహ మార్గం మార్చి రాతి నేలలపై స్పిల్‌వే.. ప్రస్తుత గోదావరి మార్గంలో ప్రధాన రాతి, మట్టికట్ట నిర్మించాలని నిర్ణయించారు. ఇసుక పొరల్లో నీటి ఊటతో లీకులు ఏర్పడకుండా అడ్డుకునేందుకే డయాఫ్రం వాల్‌ కట్టారు.

స్వదేశీ కంపెనీలకు ఆ సామర్థ్యం లేదు..

వాస్తవానికి గోదావరిలో ఇంతలోతులో డయాఫ్రం వాల్‌ నిర్మించే సామర్థ్యం స్వదేశీ గుత్తేదారు కంపెనీలకు లేదు. అందువల్ల బావర్‌ సంస్థకు అప్పజెప్పారు. ఈ సంస్థ ఎల్​అండ్​టీతో కలిసి నదీగర్భంలో కొన్నిచోట్ల 100 మీటర్ల లోతు నుంచి గోడ నిర్మించింది. మరికొన్నిచోట్ల 300 మీటర్ల లోతు నుంచి ప్లాస్లిక్‌ కాంక్రీటుతో దాదాపు 1.4 కిలోమీటర్ల పొడవున గోడను 2018 జూన్‌ నాటికి నిర్మించింది. ప్రాజెక్టు ప్రధాన రాతి, మట్టికట్టను దీనిపైనే నిర్మించాల్సి ఉంది. వరదల తర్వాత ఇటీవల సర్వే చేయగా 200 మీటర్ల మేర ఎక్కువగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. కొన్నిచోట్ల 4 నుంచి 8 మీటర్ల లోతు వరకు ధ్వంసమైనట్లు భావిస్తున్నారు.

ఇసుక పొరల మధ్యే ఉంది..

ఈ గోడ అధిక శాతం గోదావరి గర్భంలో ఇసుక పొరల మధ్యే ఉంది. పైగా ఇప్పటికీ దీనిపై నది ప్రవహిస్తోంది. ఫలితంగా నిర్మాణం ఎలా ఉందో పూర్తిస్థాయిలో తెలుసుకోవడానికి మరికొంత సమయం పడుతుందని తెలుస్తోంది. కాఫర్‌ డ్యాంల నిర్మాణం పూర్తయ్యాకే అధికారులు డయాఫ్రం గోడపై అధ్యయనం చేస్తారని సమాచారం. కాఫర్‌ డ్యాంల నిర్మాణం పూర్తయితే గోదావరిలో ప్రవాహం ఆగిపోయి గోడ ఎగువ భాగం మొత్తం బయటకు కనిపిస్తుంది.

మరింత ఆలస్యమయ్యే అవకాశం

ప్రస్తుత సీజన్లోనే ప్రధాన రాతి మట్టికట్ట నిర్మాణం పూర్తి చేయాలనుకున్నా డయాఫ్రం గోడ పరిస్థితి అధ్యయనం వంటి కారణాలతో మరింత ఆలస్యమయ్యే అవకాశముంది. ఎగువన కొంత మేర కాఫర్‌డ్యాం నిర్మాణం వల్ల ప్రవాహాలు గోదావరి అంతటా కాకుండా కొంతమేర మాత్రమే దిగువకు చేరే పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా.. ప్రవాహ వేగమూ పెరిగింది. ఒక్కోసారి సెకనుకు 13 మీటర్ల వేగంతో గోదావరి ప్రవహించినట్లు నిపుణులు లెక్క కట్టారు.

ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి..

డయాఫ్రం వాల్‌ దెబ్బతినడం వల్ల ప్రత్యామ్నాయ చర్యలపై పోలవరం డ్యాం డిజైన్‌ రివ్యూ కమిటీ దృష్టి సారించింది. గోడను నిర్మించిన బావర్‌ సంస్థతోనే మళ్లీ అధ్యయనం చేయించి వారితోనే పని చేయించే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.

ఇదీ చూడండి:

పోలింగ్​కు సర్వం సిద్ధం.. పరిశీలనకు ప్రత్యేకాధికారులు

Last Updated : Mar 10, 2021, 10:28 AM IST

ABOUT THE AUTHOR

...view details