రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘటనలో మాజీమంత్రి కొల్లు రవీంద్రను అరెస్టు చేయడం దారుణమని... మాజీమంత్రి దేవినేని ఉమ వ్యాఖ్యeనించారు. రాజకీయ కుట్రతోనే మోకా హత్య కేసులో రవీంద్రను ఇరికించారని అన్నారు. కొల్లు రవీంద్రను కలిసేందుకు ఆయన రాజమహేంద్రవరం కేంద్రకారాగారానికి రాగా... కరోనా కారణంగా లోపలకి అనుమతించలేదు. దీంతో కారాగారం గేటు వద్ద తెదేపా నాయకులతో కలిసి కొద్దిసేపు నిరసన తెలిపారు.
రాజకీయ కుట్రతోనే కొల్లు రవీంద్రపై హత్య కేసు: దేవినేని
కొల్లు రవీంద్ర వ్యక్తిత్వంపై ఎవరిని అడిగినా చెబుతారని... రాజకీయ కుట్రతోనే ఆయనపై హత్య కేసు నమోదు చేశారని మాజీమంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. ప్రాథమిక విచారణ లేకుండా రవీంద్రను అరెస్టు చేసి హత్య కేసులో ఏ-4గా చేర్చారని ధ్వజమెత్తారు.
కొల్లు రవీంద్ర గురించి ప్రతీ ఒక్కరికీ తెలుసని... ప్రభుత్వ తప్పులని బలంగా ప్రశ్నించడం వల్లే కేసులో ఇరికించి జైలుకు పంపారని విమర్శించారు. ప్రాథమిక విచారణ లేకుండానే రవీంద్రను అరెస్టు చేసి.. మోకా హత్యకేసులో ఏ-4 నిందితుడిగా చేర్చటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అడిగినప్పుడు ఏమీ మాట్లడని పోలీసు అధికారులు.. 8 గంటల్లో నిందితులను పట్టుకున్నామని చెబుతున్నారని ఆక్షేపించారు.
న్యాయస్థానాలు, మీడియాపైనా వైకాపా ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందని ఉమ ధ్వజమెత్తారు. ఈటీవీ, ఈనాడు సహా మరికొన్ని ఛానల్స్ ప్రసారాలు రాకుండా సీటీకేబుల్ యాజమాన్యాలపై తీవ్రంగా ఒత్తిళ్లు తెస్తున్నారని మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో దళితుడైన విక్రమ్ హత్య కేసులో స్థానిక ఎమ్మెల్యే ప్రమేయం ఉందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా... ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. కొల్లు రవీంద్ర వ్యవహారంలో మాత్రం పోలీసులు రోజుకోరకంగా వ్యవహరించి కేసు నమోదుచేశారని ఉమ ఆవేదన వ్యక్తం చేశారు.