Social Media Posts on Judges:న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన నిందితులు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ముగ్గురు అరెస్టు కాగా.. కళానిధి గోపాలకృష్ణ, మెట్ట చంద్రశేఖర్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. కళానిధి గోపాలకృష్ణ ఆరోగ్యం సరిలేదని బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాది వాదించారు. వాదనలు విన్న న్యాయస్థానం..విచారణలో ఘాటు వ్యాఖ్యలు చేసింది. కాపాడాల్సిన వాళ్లే న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజారుస్తారా ? అని ప్రశ్నించింది. న్యాయవ్యవస్థను దూషిస్తూ పోస్టులు పెడితే సహించేది లేదని స్పష్టం చేసింది. అనంతరం విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
నిందితులకు రిమాండ్..
హైకోర్టు న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన కేసులో ముగ్గురిని ఈనెల 12న హైదరాబాద్‌లో అరెస్టు చేసి అదేరోజు గుంటూరుకు తరలించారు. ఇక్కడ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచగా ముగ్గురికీ 14 రోజుల రిమాండ్ విధించడంతో గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. నిందితులను మూడు రోజుల కస్టడీకి కోరుతూ న్యాయస్థానంలో 12న సీబీఐ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు.