ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సైబర్​ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ: సొమ్ములు సమర్పించుకొనే క్విక్​ యాప్​

సైబర్​ నేరగాళ్లు రోజురోజుకూ విజృంభిస్తున్నారు. లాక్​డౌన్​లో ఆన్​లైన్​ లావాదేవీలు పెరగడం... వారి అక్రమాలకు మరింత దారినిస్తోంది. కొత్తగా స్మార్ట్​ ఫోన్​ల వాడకాన్ని నేర్చుకుంటున్నవారిపై వివిధ రకాల అస్త్రాలు ప్రయోగిస్తూ రూ.లక్షల్లో డబ్బులు కొల్లగొడుతున్నారు. తాజాగా క్విక్​ సపోర్ట్​ యాప్​ డౌన్​లోడ్ చేస్కోండి.. తర్వాత వచ్చే కోడ్​ చెప్పండి అంటూ మోసం చేస్తున్నారు.

cyber-crimes-increasing
సైబర్​ నేరగాళ్ల కొత్త ఎత్తుగడలు

By

Published : May 27, 2020, 11:59 AM IST

‘సర్‌.. నేను ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నాను. నా కుమారుడు పేటీఎం మొబైల్‌యాప్‌ను ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేశాడు. మూడు రోజుల క్రితం సందీప్‌ అనే యువకుడు ఫోన్‌ చేశాడు. మీ వివరాలు నవీకరించాలి.. 'క్విక్‌ సపోర్ట్‌ యాప్‌'ను ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోమన్నాడు. డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత ఒక కోడ్‌ నంబర్‌ వస్తుంది.. అది చెప్పండి అన్నాడు.. సరేనని చెప్పాను. సోమవారం మధ్యాహ్నం నా చరవాణికి మూడు సంక్షిప్త సందేశాలొచ్చాయి. గంటల వ్యవధిలో రూ.2.20 లక్షలు నా బ్యాంక్‌ ఖాతాలో తగ్గాయి. ఓటీపీ నేను ఎవరికీ చెప్పలేదు. ఇదేంటో నాకు అర్థం కావడం లేదు.

-అంబర్‌పేటకు చెందిన ప్రైవేటు ఉద్యోగి ఆవేదన ఇది.

ఇలాంటి అనుభవం ఒక్కరికే పరిమితం కాదు. 'క్విక్‌ సపోర్ట్‌ యాప్‌'ను డౌన్‌లోడ్‌ చేసుకున్న వారిలో 80 శాతం మంది సైబర్‌ నేరస్థుల బారినపడి రూ.లక్షలు నష్టపోతున్నారు. పేటీఎం, బ్యాంక్‌ సేవలను వేగంగా అందించే మొబైల్‌ యాప్‌ అనుకుని చాలామంది 'క్విక్‌ సపోర్ట్‌'ను తమ ఫోన్లలోకి డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. 'క్విక్‌ సపోర్ట్‌' మొబైల్‌ యాప్‌ ద్వారా సాఫ్ట్‌వేర్‌ సంస్థలు, ఉద్యోగులు చాలా ప్రయోజనాలను పొందుతున్నారు.

ఈ యాప్‌లోని వేర్వేరు అంశాలను పరిశీలించిన సైబర్‌ నేరస్థులు వీటి ద్వారా రూ.వేలు, లక్షలు నగదు బదిలీ చేసుకోవచ్చని ప్రయోగాత్మకంగా పరిశీలించి నమ్మకం కుదిరిన తర్వాత బాధితులకు ఫోన్‌ చేస్తున్నారు. రూ.లక్షలు కొల్లగొడుతున్నారు.

సులువుగా నగదు బదిలీ...

బ్యాంకుల వద్దకు రాకుండా అంతర్జాల ఆధారిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేటు బ్యాంకులు చరవాణి ద్వారా యాప్‌లను అందుబాటులోకి తీసుకువచ్చాయి.స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బడ్డీ, రూపీ, ఐసీఐసీఐ పాకెట్స్‌ ఇలా వేర్వేరు బ్యాంకులు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చాయి. వీటితోపాటు పేటీఎమ్‌, పేయూ, ఫోన్‌పే వంటి కార్పొరేట్‌ ఈ-వ్యాలెట్‌లు ఈ సేవలను అందిస్తున్నాయి.

వీటి ద్వారా సైబర్‌ నేరస్థులు మరింత సులువుగా బాధితుల నుంచి నగదు బదిలీ చేసుకునేందుకు 'క్విక్‌ సపోర్ట్‌'ను ఎంచుకున్నారు. రాజస్థాన్‌, బిహార్‌ రాష్ట్రాల నుంచి ఫోన్లు చేస్తున్న నిందితులు ఆంగ్లం, హిందీలో మాట్లాడి చరవాణిలో యాప్‌ను భద్రంగా ఉంచుకోవాలంటూ సూచిస్తున్నారు. డౌన్‌లోడ్‌ చేసుకుంటే పలు ప్రయోజనాలున్నాయంటూ ఒకరిద్దరు ఫోన్‌ చేసి మరీ వివరిస్తుండడంతో బాధితులు నిజమేననుకుని వారు సూచించిన విధంగా చేస్తున్నారు.

దొంగచేతికి తాళాలు అప్పగించడమే..

క్విక్‌ సపోర్ట్‌’ యాప్‌లో డబ్బే కాదు.. వ్యక్తిగత సమాచారమంతా నేరస్థుడి ఫోన్‌లోకి వెళ్తుంది. బాధితుడి స్నేహితులు, కుటుంబ సభ్యుల వివరాలు, బ్యాంకు ఖాతాలు, ఓటీపీలతోపాటు ఫొటోలు, వీడియోలు కూడా నేరస్థులు చూడవచ్చు. దీంతో దొంగ చేతికి మనింటి తాళాలు అప్పగించడమేనని పోలీసులు చెబుతున్నారు. క్విక్‌ సపోర్ట్‌ యాప్‌ అంటూ ఫోన్‌ వస్తే స్పందించవద్దని సైబర్​ క్రైమ్స్​ ఏసీపీ కేవీఎం ప్రసాద్ సూచిస్తున్నారు.

ఇవీ చూడండి:

శ్రామిక్ రైలును ప్రారంభించిన డీజీపీ సవాంగ్

ABOUT THE AUTHOR

...view details