COVID TESTS: రాష్ట్రంలో కొవిడ్ నిర్ధరణ పరీక్షలు పరిమితంగానే జరుగుతున్నాయి. గతంలో కొత్త కేసు రాగానే... ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌ను గుర్తించి పరీక్షలు చేసేవారు. ఇప్పుడు ఆ ఛాయలే కనిపించని పరిస్థితి. పరీక్షలు పెరిగితే బయటపడే కేసులకు తగ్గట్లు వైరస్ వ్యాప్తి నియంత్రణకు అవకాశం ఉంటుంది. కానీ జిల్లాల్లో అందుకు తగిన కార్యాచరణ ఉండడం లేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణనైతే అసలు కనిపించడం లేదు. ల్యాబ్స్, పరికరాలను సద్వినియోగం చేసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పరీక్షలు ఎక్కడ చేస్తున్నారన్న వివరాల కోసం విశాఖ లాంటి చోట్ల కొవిడ్ కాల్‌సెంటర్‌కు ఫోన్లు వస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం రాష్ట్రంలో 6 సీబీనాట్, 5 క్లియా, నాకో, 200 వరకు ట్రూనాట్, 19 వీఆర్డీఎల్ మిషన్లు ఉన్నాయి. చాలా చోట్ల ట్రూనాట్ మిషన్లను కొవిడ్ నిర్థరణకు వాడటం లేదని తెలుస్తోంది. కేసులు అధికంగా ఉన్న చిత్తూరు, విశాఖ జిల్లాల్లోనూ నిర్థరణ పరీక్షలు 5 వేలు దాటడంలేదు. చిత్తూరు జిల్లా కన్నా విశాఖలోనే తక్కువగా పరీక్షలు జరుగుతున్నాయి. రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో సేకరించిన నమూనాలను ఆర్టీపీసీఆర్ ల్యాబ్స్‌కు తరలించేందుకు వాహనాలు ఒకటి, రెండురోజులకోకసారి వస్తున్నాయి. ఈ లోగా ర్యాపిడ్ యాంటీజెన్స్ ద్వారా నిర్థరణ పరీక్షలు చేస్తున్నారు.