గతంలో ఎన్నో మహమ్మారులను ఎదుర్కొన్న మానవాళి ఇప్పుడు కరోనాపై కూడా తప్పక విజయం సాధించే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు. ఎలాంటి పనికైనా ప్రజల భాగస్వామ్యం ఉంటేనే అది విజయవంతమవుతుంది. అలాగే ఇప్పుడు కరోనాపై పోరులో కూడా ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని అంటున్నారు. వారి భాగస్వామ్యం లేకుండా మహమ్మారిని తరిమికొట్టడం కష్టమేనని అంటున్నారు. అంటే ఇప్పుడు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న ఈ మహమ్మారిని అదుపు చేయడం మన చేతుల్లోనే ఉందన్న విషయాన్ని గుర్తుంచుకుంటే చాలు. స్వీయ రక్షణతోపాటు సామాజిక భద్రతను గుర్తించి తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటేనే మనతోపాటు భవిష్యత్ తరాల వారు ఆరోగ్యవంతమైన జీవనం గడపగలరు.
మెుండిగా ఎదుర్కోవలసిందే
కరోనాతో కంటిమీద కునుకులేదు ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు. వైరస్ సోకిన వారిని చూసి .. అయ్యో అని జాలిపడటం తప్ప చేయగలిగిందేం లేదు. దగ్గరి బంధువులే కాదు సొంత ఇంట్లోని వారికి సోకినా సాయం అందించలేని పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదని అనుకుంటూనే నిత్యం ఆందోళనతో బతకాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎంతమంది ఉన్నప్పటికి.. ఎవరికి వారు.. ఒంటరితతనాన్ని అనుభవించాల్సిన పరిస్థితులు. అలాగని జీవనపోరాటాన్ని కొనసాగించక తప్పదు . మొండిగా మహమ్మారిని ఎదుర్కోవలసిందే.
ఇలాంటి మహమ్మారులను ఎన్ని చూడలేదు. వాటితోపాటే ఇదీను అనుకొని ముందుకు సాగాల్సిందే. ప్రస్తుతం కరోనాను ఎదుర్కోవాలంటే సానుకూల దృక్పథం ఎంతో ముఖ్యమైనది. అప్పుడే దాన్ని గట్టిగా ఎదుర్కోగలం. పూర్తి స్థాయిలో మందులు టీకాలు వచ్చే సమయాన్ని కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. అందుకే చాలామందిలో ఆందోళన నెలకొంది. అయినా గాని వైరస్‌పై పోరు కొనసాగుతునే ఉంది. విజయం సాధించేవరకూ వెనకడుగు వేసేదే లేదన్నట్టుగా వైరస్‌పై ప్రభుత్వాలు యుద్దాన్ని ప్రకటించాయి. అయితే ఈ యుద్దంలో గెలవాలంటే ప్రభుత్వాలు మాత్రం సన్నద్ధంగా ఉంటేచాలదు అందుకు ప్రజల భాగస్వామ్యం కూడా అవసరం.
గాలి ద్వారనూ.. వైరస్!
ప్రధాని మోదీ వ్యాఖ్యానించినట్లు కరోనాపై పోరాటం ఇప్పట్లో ముగిసేది కాదు. అయితే శతాబ్దకాలంలో కనీవినీ ఎరుగనంతటి ఆరోగ్య సంక్షోభాన్ని అధిగమించడంలో ప్రజల వైపునుంచి వచ్చే స్పందనే ఆందోళన కలిగిస్తోంది. గట్టిగా తుమ్మితే, దగ్గితే వచ్చే పెద్దతుంపర్లతోనే కరోనా వైరస్ ఇతరులకు సోకుతుందని ఇప్పటిదాకా చెప్పిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు మాట్లాడినప్పుడు వచ్చే సూక్ష్మ తుంపర్లతోనూ ముప్పు తప్పదని చెబుతోంది. గాలి ద్వారానూ వైరస్ వ్యాపించే ప్రమాదాన్ని గుర్తించడం కొత్త ఆందోళనకు కారణమయింది.
చెబుతున్నా.. పట్టించుకోరే..
దగ్గు, తుమ్ములద్వారా ఒకరినుంచి మరొకరికి కరోనా వ్యాపించకుండా కట్టడిచేసే లక్ష్యంతోనే లాక్‌డౌన్ విధించారు. ప్రార్థనా మందిరాలు, థియేటర్లు, మ్యూజియాలు, వ్యాయామశాలలు తదితరాల్ని మూసివేతకు ప్రధాన కారణమదే. ఆ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ కొన్నాళ్లుగా జనసామాన్యంలో నిబంధనల ఉల్లంఘన ఎక్కువవుతోంది. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయవద్దని పదేపదే చెబుతున్నా పట్టించుకునే వారేరి. కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారిలోనూ కొంతమంది రోడ్లపై తిరుగుతున్నారని, అటువంటివారూ మాస్కులు ధరించకుండా తిరగడం వల్లే.. వైరస్ వ్యాప్తి జోరందుకోడానికి ముఖ్యకారణంగా కనిపిస్తోంది. ప్రజల్లో ఉన్నఇలాంటి వైఖరే పరిస్థితి చేజారడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి.