ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఒక్కరోజే 15 పాజిటివ్ కేసులు.. ఇద్దరు మృతి - ఏపీలో 15 కేసులు నమోదు న్యూస్

రాష్ట్రంలో కరోనా మరణాలు ఆరుకు చేరాయి. ఇప్పటికే వైరస్‌తో నలుగురు మృతి చెందగా... నిన్న మరో ఇద్దరూ మృతి చెందారు. గురువారం 15 పాజిటివ్‌ కేసుల నమోదుతో.. మొత్తం బాధితుల సంఖ్య 363కు చేరింది. ప్రకాశంలో అత్యధికంగా 11 కేసులు నమోదయ్యాయి. చికిత్స అనంతరం కోలుకుని తిరుపతిలో ఒకరు డిశ్చార్జి అయ్యారు.

corona positive cases in ap
corona positive cases in ap

By

Published : Apr 10, 2020, 4:49 AM IST

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తోంది. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన 45 ఏళ్ల వ్యక్తి.... వైరస్ కారణంగా మృతి చెందినట్టు అధికారులు ధ్రువీకరించారు. గుంటూరులో మరో 2 కేసుల నమోదుతో... మొత్తంగా వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 51కి చేరింది. ఈ పరిస్థితుల్లో గుంటూరు నగరంలోని పది ప్రదేశాలను అధికారులు కంటైన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించారు. ఇవాళ్టి నుంచి లాక్‌డౌన్‌ను మరింత పకడ్బందీగా అమలు చేయనున్నట్లు కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకపోతే వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం ప్రాంతానికి చెందిన వృద్ధుడు మంగళవారం చనిపోగా... కరోనా సోకడం వల్లే చనిపోయినట్లు తేల్చారు. అనంతపురం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా పక్కబెడ్‌లో ఉన్న హిందూపురం వ్యక్తి నుంచి ఈయనకు వైరస్ సోకింది. ఇప్పటికే ఈ వృద్ధుడి కుటుంబ సభ్యులను అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. జిల్లాలో మొత్తం 13 కరోనా కేసులు నమోదుతో... ఇప్పటికే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన 11 మంది చికిత్స పొందుతున్నారు.

ప్రకాశం జిల్లాలో గురువారం అత్యధికంగా 11 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరంతా ఒంగోలుకు చెందిన వారిగా గుర్తించారు. కొత్త కేసులతో కలిపి జిల్లాలో వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 38కి చేరింది. మైదుకూరులో మరో కేసు నమోదు కావటంతో కడప జిల్లాలో బాధితుల సంఖ్య 29కి చేరింది. తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు తేలటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సదరు వ్యక్తి విశాఖ జిల్లా పాయకరావుపేట వాసిగా గుర్తించిన యంత్రాంగం... కుటుంబీకులు, బంధువుల వివరాలు సేకరించే పనిలో పడ్డారు.

కర్నూలు జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా 75 మంది బాధితులు ఉండగా... గురువారం కొత్త కేసులు నమోదు కాలేదు. నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకూ 48 మంది కరోనా బారిన పడగా... ఒకరు కోలుకుని ఇంటికి వెళ్లారు. కృష్ణా జిల్లాలో మొత్తం 35 కరోనా కేసులు, పశ్చిమగోదావరి జిల్లాలో 22 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 20 మంది మహమ్మారి బారిన పడగా... శ్రీకాళహస్తికి చెందిన యువకుడు తిరుపతిలో చికిత్స పొంది కోలుకున్నాడు. గురువారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. విశాఖ జిల్లాలో 20 మంది కొవిడ్‌ బాధితులుండగా.. నలుగురు డిశ్చార్చి అయ్యారు.

ఇదీ చదవండి: కరోనాపై పోరుకు రూ.15 వేల కోట్లు మంజూరు

ABOUT THE AUTHOR

...view details