ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

లాక్​డౌన్ ఎఫెక్ట్: దేవాలయాలకు తప్పని కరోనా కష్టాలు - లాక్​డౌన్ ఎఫెక్ట్

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న లాక్ డౌన్... అన్ని రంగాలపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే ఎన్నో పరిశ్రమలు మూతపడగా... లక్షల మంది ఉపాధి కోల్పోయారు. ఎప్పుడూ నిత్యపూజలు, భక్తులతో సందడిగా ఉండే దేవాలయాలు సైతం లాక్​డౌన్ ప్రభావంతో మూతపడ్డాయి. భక్తులు లేకుండానే పూజలు, పర్వదినాలు పూర్తి చేసుకుంటున్నాయి. టిక్కెట్ల దగ్గరి నుంచి ఇతరత్రా ఆర్జిత సేవల వరకు ఎలాంటి విక్రయాలు లేకపోవడంతో దేవాలయాల ఆదాయం పూర్తిగా పడిపోయింది.

By

Published : May 17, 2020, 6:43 PM IST

కరోనాను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కట్టుదిట్టంగా అమలవుతోంది. అయితే లాక్ డౌన్ ప్రభావంతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. లాక్ డౌన్ ప్రభావం దేవుళ్లపైనా పడింది. చిన్నచిన్న దేవాలయాల నుంచి రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల వరకు అన్ని మూతపడ్డాయి. ఎప్పుడూ మంగళవాయిద్యాలు, వేదమంత్రాలతో సందడిగా ఉండే ఆలయాలు నేడు భక్తులు లేక బోసిపోతున్నాయి. నిత్యపూజలు, హోమాలు సహా... అన్ని రకాల కైంకర్యాలు భక్తులు లేకుండానే జరుగుతున్నాయి.

ఇటీవల ఉగాది, శ్రీరామనవమి లాంటి పర్వదినాలను సైతం భక్తులు లేకుండా సాదాసీదాగా కేవలం అర్చకులు, ఆలయ సిబ్బందితోనే పూర్తిచేశారు. దేవాలయాలకు ప్రధానంగా హుండీలు, దర్శన టికెట్ల విక్రయాలు, ఆర్జిత సేవలు, ప్రసాద విక్రయాలు, కానుకల ద్వారా ఆదాయం సమకూరుతుంది. అయితే లాక్​డౌన్ విధించిన నాటినుంచి ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని దేవాలయాలకు భక్తుల రాకను నిలిపివేశారు. దీంతో హుండీలు, దర్శన టికెట్లు, ప్రసాదాల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం పూర్తిగా పడిపోయింది. ఆన్​లైన్ ద్వారా ఆర్జిత సేవల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినా... అవన్నీ పరోక్ష సేవలు కావడంతో స్పందన కరవైంది. ఫలితంగా ఆదాయం సమకూరే అన్ని దారులు మూసుకుపోయాయి. కొన్ని దేవాలయాల్లో సిబ్బందికి జీతభత్యాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది.

లాక్​డౌన్ అనంతరం దేవాలయాలను తెరిచి... దర్శన ఏర్పాట్లు చేసేందుకు దేవాదాయశాఖ అధికారులు సిద్ధంగా ఉన్నా... భౌతికదూరం, శానిటైజర్ల వాడకం ఇలా పలు ఆంక్షలతో ఆలయాలకు భక్తుల రాక ఎంత వరకు ఉంటుందనేది ప్రస్తుతం ప్రశ్నగా మారింది.

ABOUT THE AUTHOR

...view details