మరో 32 పాజిటివ్ కేసులు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆదివారం వరకు రాష్ట్రంలో 531 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... సోమవారం మరో 32 కేసులు నిర్ధరణ అయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో అధికారులు వివరాలు తెలిపారు. కరోనా వల్ల మరొకరు మృతి చెందినట్లు చెప్పారు. కరోనా నివారణా చర్యలు, లాక్డౌన్ అమలు తదితర అంశాలపై వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు.
నగరంపై ప్రత్యేక దృష్టి
కరోనా కేసుల స్థితిని వివరించిన అధికారులు... పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున అన్ని లేబరేటరీలు, ఆసుపత్రులను సిద్ధం చేసినట్లు చెప్పారు. ఒక్క రోజు వెయ్యి నుంచి 11 వందల మందికి పరీక్షలు నిర్వహించేలా... ఎన్ని కేసులొచ్చినా వైద్యం అందించేందుకు వ్యవస్థను సిద్ధం చేసినట్లు వివరించారు. జిల్లాల వారీగా పరిస్థితులను సమీక్షించిన సీఎం... కొందరు జిల్లా అధికారులతో నేరుగా మాట్లాడి పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో కరోనా సోకిన వారిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని వారే ఎక్కువ సంఖ్యలో ఉంటున్నందున నగరంపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఒక్కో జోన్ ఒక్కో యూనిట్
హైదరాబాద్‌ను జోన్లుగా విభజించి, ఒక్కో జోన్‌ను ఒక్కో యూనిట్‌గా పరిగణించి, ప్రత్యేక అధికారులను నియమించాలని చెప్పారు. పాజిటివ్ కేసులు నమోదైన కంటైన్మెంట్లను మరింత పకడ్బందీగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ఎక్కువ కేసులు నమోదై పాజిటివ్ వచ్చిన వారి ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశాలు హైదరాబాద్‌లోనే ఎక్కువ ఉన్నందున ప్రత్యేక వ్యూహం అనుసరించాలని స్పష్టం చేశారు. నగరంలోని మొత్తం 17 సర్కిళ్లను 17 యూనిట్లుగా విభజించి ప్రతి యూనిట్‌కు ప్రత్యేకంగా వైద్యాధికారిని, పోలీసు అధికారిని, మున్సిపల్ అధికారిని, రెవెన్యూ అధికారిని నియమించాలని తెలిపారు. మున్సిపల్ యంత్రాంగమంతా కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో నిమగ్నం కావాలని ముఖ్యమంత్రి తెలిపారు.