ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో హైదరాబాద్ అతలాకుతలమైంది. రహదారులతో పాటు పలు లోతట్టు ప్రాంతాలు... వరదనీటితో మునిగిపోయాయి. నీరు ఇళ్లలోకి చేరడం వల్ల నిత్యావసర సరకులు తడిసిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్‌స్తంభాలు నేలకూలాయి. సరూర్‌నగర్ పరిధిలోని కోదండరాంనగర్, హనుమాన్‌నగర్, పద్మావతికాలనీలను వరదనీరు ముంచెత్తింది. కాలనీలు చెరువుల్లా మారడం వల్ల ఎక్కడ మ్యాన్‌హోల్ ఉందో తెలియక అవస్థలు పడ్డారు. శారదనగర్‌లోని ఓ ఇంట్లోకి వరద నీరు చేరడం వల్ల అందులో ఉంటున్న వృద్ధున్ని స్థానికులు భవనంపై గదిలోకి తరలించారు.
ఆటోపై కూలిన చెట్టు
బేగంపేట్ మయూరి మార్గ్ కాలనీలో వరదనీరు చేరి స్థానికులు ఇంటికే పరిమితమయ్యారు. ఇళ్లల్లోకి నీరు ప్రవేశించినందున రాత్రంతా ఆ నీటిని బయటకు ఎత్తిపోశామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అంబర్‌పేట్-ఉప్పల్ రహదారిపై వెళ్తున్న ఆటోపై చెట్టు కూలింది. డ్రైవర్‌కు ప్రాణాపాయం తప్పగా... ఆటో ధ్వంసమైంది. విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు చెట్టును తొలగించారు.
గరిష్ఠానికి చేరిన సాగర్ నీటిమట్టం
లింగంపల్లి, చందానగర్, మియాపూర్ పరిసరాల్లోనూ రహదారులన్నీ జలమయమయ్యాయి. పాత లింగంపల్లి ప్రాంతంలో మురుగునీటితోపాటు.. వర్షపునీరు తోడై రాకపోకలకు అంతరాయం కలిగింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలుకాలనీల వీధులు జలమయమయ్యాయి. వనస్థలిపురం పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పర్యటించి వారి సమస్యలను తెలుసుకున్నారు. భారీగా కురుస్తున్న వర్షానికి హుస్సేన్‌సాగర్‌లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. హుస్సేన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు కాగా.. ప్రస్తుతం 513.60 మీటర్లుగా ఉంది. సాగర్ గేట్లు పైకి ఎత్తి అధికారులు నీటిని కిందకు వదులుతున్నారు.