భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు పథకాలను కొనసాగించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, మంత్రుల ఇళ్ల ముట్టడి కార్యక్రమాలు జరిగాయి. కార్మికులకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ఇచ్చినట్టు చెబుతున్న ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఇంటిని ముట్టడికి యత్నించిన కార్మిక సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు. కాకినాడలో మంత్రి కురసాల కన్నబాబు నివాసం ముట్టడి కార్యక్రమాన్ని భగ్నం చేసి... కార్మికులను అరెస్టు చేశారు.
అమలాపురంలో మంత్రి పినిపే విశ్వరూప్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. కడప జిల్లాలో ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా క్యాంపు కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించారు. కార్మికుల సమస్యలను విన్న అంజద్ బాషా... వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. పుత్తూరులో ర్యాలీ నిర్వహించిన కార్మికులు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామికి వినతి పత్రాన్ని అందజేశారు.