మరికొన్ని రోజుల్లో పురపాలక ఎన్నికలు జరగబోతున్న వేళ.. విజయవాడలో తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వర్గాల మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలూ లేకపోయినా.. పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణుల మధ్య ఐక్యత దెబ్బతిన్నట్టు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నగరపాలక సంస్థ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థి ఖరారైనట్టు ఓ వర్గం ప్రచారంలో దూసుకుపోతుంటే.. మరో వర్గం మాత్రం అధిష్ఠానం ఇంకా ప్రకటించలేదని స్పష్టం చేస్తోంది.
మార్చి 10న విజయవాడ నగరపాలక సంస్థకు ఎన్నికలు జరగనుండగా ఎంపీ కేశినేని ఇటీవలే పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రచారం ప్రారంభించారు. అక్కడ ప్రస్తుతం పార్టీ ఇన్‌ఛార్జ్ ఎవరూ లేనప్పటికీ నాగుల్‌మీరా అనధికారికంగా ఆ బాధ్యతలు చూస్తున్నారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ వర్గీయులు సైతం చురుగ్గా ఉన్నారు. 2019 ఎన్నికల ముందువరకూ.. బుద్దా, నాగుల్‌మీరా, జలీల్‌ఖాన్, బొండా ఉమ.. కేశినేనికి విధేయులుగా ఉండేవారు. ఎన్నికల తర్వాత వీరి మధ్య గ్రూపులు ఎక్కువై.. బుద్దా, నాగుల్‌మీరా ఒక్కటవగా.. బొండా ఉమ అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నట్టు పార్టీ అంతర్గత సమాచారం.