విజయవాడలోని బాపు ప్రదర్శనశాలను ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఆది మానవుడి యుగం నుంచి ఆధునిక యుగం వరకు.. భారత దేశ చరిత్ర, సంస్కృతి ఆనవాళ్లను వివరించే వస్తువులు.. ఆసక్తిగొలిపే ఆయుధాలు, శిల్పాలు అన్నింటినీ ఒకే చోట కొలువుదీర్చిన ఈ ప్రదర్శన శాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ పదర్శన శాల కొత్తరూపు సంతరించుకుంది.
క్రీస్తుపూర్వం పది వేల సంవత్సరాల నుంచి నుంచి 19వ శతాబ్దం వరకు మానవులు వినియోగించిన సుమారు 1500 రకాల వస్తువులు ఇక్కడ ఉంచారు. మ్యూజియంలోని చారిత్రక యుగ గ్యాలరీ, బుద్ద జైన గ్యాలరీ, హిందూ శిల్ప గ్యాలరీ, నాణేల గ్యాలరీ, ఆయుధాలు, రక్షణ కవచాల వివరాలను రాష్ట్ర పురావస్తుశాఖ కమిషనర్ జి.వాణిమోహన్.. సీఎంకు వివరించారు. రాష్ట్రంలో వెలుగుచూసిన బుద్ద, జైనుల శిల్పాలు.. మధ్య యుగంలో మట్టితో తయారైన శవపేటిక.. ఆంధ్రుల వైభవం.. మన సంస్కృతి, వారసత్వ ఘనత అంశాల వివరాలు తెలియజేసేందుకు సాంకేతికతే ఓ గైడ్‌గా ఎలా ఉపయోగపడుతుందనేది చూపించారు.
ఏడు గ్యాలరీల్లోని కియోస్కులు ఏర్పాటు చేశారు. బాపు మ్యూజియం ఎన్నో చారిత్రకమైన వస్తువులు, పురావస్తు శిల్పకళా సంపద, పురాతన వస్తువులకు కేంద్రంగా ఉందనే విషయాన్ని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. పింగళి వెంకయ్య ఈ భవనంలోనే జాతీయ పతాకాన్ని మహాత్మాగాంధీకి అందించిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. 1962లో రాష్ట్ర పురావస్తు శాఖ ఈ భవనాన్ని స్వాధీనం చేసుకుని, విక్టోరియా మ్యూజియంను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత దీన్ని బాపు మ్యూజియంగా మార్చారని.. తెలిపారు. బాపు మ్యూజియంలో ముఖ్యమంత్రి మహాత్మా గాంధీ విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు.
విక్టోరియా మెమోరియల్ భవన ప్రాంగణంలో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునికీకరించిన బాపు మ్యూజియం ఆశాంతంగా తిలకించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,పేర్ని నాని, కొడాలి నాని, కె. కన్నబాబు, కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు ఇవే