జిల్లా కలెక్టర్లు, ముస్లిం మతపెద్దలతో సీఎం జగన్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 'రంజాన్ మాసాన్ని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దాన ధర్మాలు చేస్తారు. కానీ ప్రపంచంలో, దేశంలో ఏ జరుగుతుందో అందరికీ తెలుసు. కరోనా వైరస్‌ను అధిగమించేందుకు కొన్ని రోజులుగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఉగాది, శ్రీరామ నవమి, గుడ్‌ఫ్రైడే, ఈస్టర్ పండుగలు ఈ సమయంలోనే వచ్చాయి. రంజాన్ కూడా ఇప్పుడే వచ్చింది. ఇళ్లలోనే ఉంటూ ప్రార్థనలు చేసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితులు నెలకొన్నాయి. మీరంతా సహకరించి ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని కోరుతున్నా. ఇది మనసుకు కష్టమైన మాట అయినా సరే చెప్పక తప్పని పరిస్థితి' అని సీఎం అన్నారు. రంజాన్ మాసంలో ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకునేలా చూస్తామని ముస్లిం మతపెద్దలు ముఖ్యమంత్రికి తెలిపారు.
ప్రతి నెలా తోఫా ఉండాలి...
తోఫా అన్నది పండుగ వచ్చినప్పుడు మాత్రమే గుర్తుకు తెచ్చుకుని శనక్కాయలు, బెల్లాలు మాదిరిగా ఏదో ఇవ్వడం కాదని సీఎం అన్నారు. 'ప్రతి నెలా తోఫా ఉండాలి. అందుకే ప్రతి పేద కుటుంబానికి ప్రతి నెలా ఓ కొత్త కార్యక్రమంతో మేలు చేస్తున్నాం. కరోనా వల్ల రూపాయి ఆదాయం రావడం లేదు. ఖజానాకు రోజూ రూ.150 కోట్ల మేర రావాల్సిన ఆదాయం కోల్పోయినప్పటికీ ప్రజలు ఇబ్బంది పడకుండా అడుగులు వేస్తున్నాం. వచ్చే విద్యాసంవత్సరం నుంచి త్రైమాసికం పూర్తి కాగానే బోధనా రుసుములను విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాకే నేరుగా జమ చేస్తాం. ఆ డబ్బును తల్లి నేరుగా కళాశాలకు కడుతుంది' అని సీఎం జగన్ తెలిపారు.