ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CM Jagan Review: విద్యార్థుల సంఖ్యకు తగిన నిష్పత్తిలో టీచర్లు ఉండాలి: సీఎం జగన్ - జగన్ న్యూస్

CM Jagan Review On School Education: విద్యార్థుల సంఖ్యకు తగిన నిష్పత్తిలో టీచర్లు ఉండాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండాలన్నారు. కొత్త విద్యావిధానం వల్ల 22 వేల మంది టీచర్లకు పదోన్నతి కల్పిస్తున్నామని సీఎం తెలిపారు. ఎస్జీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి ఇవ్వటంతో పాటు పదోన్నతులు, బదిలీలు సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు.

సీఎం జగన్
సీఎం జగన్

By

Published : Feb 3, 2022, 4:15 PM IST

Updated : Feb 4, 2022, 5:27 AM IST

CM Jagan Review On School Education: మండలానికి రెండు జూనియర్‌ కళాశాలల ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉన్నత పాఠశాలలనే జూనియర్‌ కళాశాలలుగా మార్చాలని సూచించారు. వాటిలో ఒకటి కో ఎడ్యుకేషన్‌, రెండోది కేవలం విద్యార్థినుల కోసమే ఉండాలన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన పాఠశాల విద్యా శాఖపై మంత్రి ఆదిమూలపు సురేశ్‌తో కలిసి సమీక్షించారు. ‘వచ్చే ఏడాది జూన్‌ నాటికి నూతన విద్యా విధానానికి అనుగుణంగా అన్ని సంస్కరణలు పూర్తిగా అమల్లోకి రావాలి. కొత్తగా ఏర్పాటవుతున్న పాఠశాలలతో 22 వేల మందికిపైగా ఉపాధ్యాయులకు పదోన్నతులు వస్తాయి. వీరందరికీ ఎస్‌జీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్లుగా జూన్‌ నాటికి పదోన్నతులు ఇవ్వాలి’ అని ఆదేశించారు.

"విద్యార్థుల సంఖ్యకు తగిన నిష్పత్తిలో టీచర్లు ఉండాలి. కొత్త విద్యావిధానం వల్ల 22 వేల మంది టీచర్లకు పదోన్నతి వస్తుంది. ఎస్‌జీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి ఇవ్వాలి. జూన్‌ నాటికి విద్యావిధాన సంస్కరణలు పూర్తిగా అమల్లోకి రావాలి. ప్రతి మండలంలో 2 హైస్కూళ్లు, 2 కాలేజీలు ఉండాలి. ఎస్‌సీఈఆర్‌టీ సిఫారసులన్నీ అమల్లోకి రావాలి. రీసోర్స్‌ సెంటర్‌ను మండల విద్యాశాఖాధికారి కార్యాలయంగా మార్పు. ఎండీవో పరిధిలో కాకుండా ఎంఈవోకే డ్రాయింగ్‌ అధికారాలు."- జగన్, ముఖ్యమంత్రి

కొత్తగా చేరిన విద్యార్థులకు నిఘంటువు

పాఠశాలల్లో కొత్తగా చేరిన విద్యార్థులకు నిఘంటువులు అందించి, ప్రతిరోజూ ఒక పదాన్ని నేర్పాలి. 8, 9, 10 తరగతులకు డిజిటల్‌ విధానంలో బోధించాలి. దీన్నొక సబ్జెక్ట్‌గా పెట్టేలా ఆలోచించాలి. జగనన్న విద్యా కానుక, మరుగుదొడ్ల నిర్వహణ, గోరుముద్దలో నాణ్యత, పాఠశాలల నిర్వహణలో సమస్యలు తెలుసుకోడానికి ఏర్పాటు చేస్తున్న టోల్‌ఫ్రీ నంబరు 14417 సమర్థంగా పని చేయాలి’ అని సీఎం సూచించారు.

ఎస్‌ఈఆర్టీ సిఫార్సులకు ఆమోదం

పాఠశాల విద్యకు సంబంధించి ఎస్‌ఈఆర్టీ చేసిన సిఫార్సులను ముఖ్యమంత్రి ఆమోదించారు. వాటిలో... మండల రిసోర్సు సెంటర్‌ పేరును మండల విద్యాశాఖాధికారి కార్యాలయంగా మార్పు. ఎంపీడీవోకి కాకుండా ఎంఈవోకి డ్రాయింగ్‌ అధికారాలు, విద్య సంబంధిత కార్యకలాపాలన్నీ ఎంఈవోలకు అప్పగింత. ఎంఈవో పోస్టుల భర్తీ. యాప్స్‌ కన్నా... రియల్‌ టైం డాటా ఉండేలా చూడటం. ఆన్‌లైన్‌లో విద్యార్థుల హాజరుతోపాటు మార్కుల నమోదు. ఉపాధ్యాయులను బోధనేతర పనులకు వినియోగించరాదు... తదితర సిఫార్సులు ఉన్నాయి.

పాఠశాలలను విలీనం చేయడం లేదు: అధికారులు

నూతన విద్యా విధానంలో తరగతులు తప్పితే పాఠశాలలను విలీనం చేయడం లేదని సీఎంకు అధికారులు వివరించారు. పాతవి ఎట్టి పరిస్థితుల్లోనూ మూతపడవన్నారు. దీనిపై కొందరు అపోహ పడుతున్నారని అన్నారు.

ఇదీ చదవండి:

Chalo Vijayawada: సీఎం జగన్​తో సజ్జల, సీఎస్ భేటీ.. ఉద్యోగుల డిమాండ్లపై చర్చ

Last Updated : Feb 4, 2022, 5:27 AM IST

ABOUT THE AUTHOR

...view details