రాష్ట్ర తీరప్రాంతాల్లో తుపాను ప్రభావంపై ముఖ్యమంత్రి జగన్.. సీఎంవో అధికారులతో సమీక్ష నిర్వహించారు. విపత్తు తీవ్రతను తగ్గించేందుకు అవసరమైన చర్యలను చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. తుపాను ప్రభావానికి సంబంధించిన ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశామని అధికారులు సీఎంకు వివరించారు. తీసుకోవాల్సిన చర్యలపై తగిన సూచనలు జారీ చేశామన్నారు. గ్రామ సచివాలయాల వారీగా కంట్రోల్ రూములను ఏర్పాటు చేశామని తెలిపారు. విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో విపత్తు నిర్వహణ సిబ్బందిని కూడా సిద్ధం చేశామన్నారు. అవసరమైన చోట శిబిరాలు తెరిచేందుకు కలెక్టర్లు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నారని వివరించారు.
తుపాను అనంతర పరిస్థితులపైనా అప్రమత్తంగా ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. అల్పపీడనం తీరం దాటిన తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.