కొవిడ్ ప్రమాణాలకు అనుగుణంగా పెద్ద ఎత్తున జనం గుమికూడకుండా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. పెళ్లిళ్ల సీజన్లో ప్రజలు ఒకేచోట భారీగా గుమిగూడే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఒక్కో పెళ్లికి 150 మందే హాజరయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. ఊరేగింపులు, మతపరమైన కార్యక్రమాల్లోనూ ఎక్కువ మంది గుమికూడకుండా చూడాలన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగేంతవరకు ఈ జాగ్రత్తలు తప్పనిసరని పేర్కొన్నారు. ముఖ్యంగా వచ్చే 2 నెలలపాటు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు. కొవిడ్-19 నియంత్రణ, టీకాల పంపిణీ పురోగతిని సోమవారం ఉన్నతాధికారుల సమావేశంలో ఆయన సమీక్షించారు. ‘ఆర్టీపీసీఆర్ ద్వారానే వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయాలి. అప్పుడే కచ్చితమైన ఫలితాలొస్తాయి. ఇంటింటి సర్వే ద్వారా అనుమానిత లక్షణాలున్న వారిని గుర్తించి వెంటనే పరీక్షలు చేయాలి. నిరంతరం పర్యవేక్షిస్తూ 104 కాల్‌సెంటర్‌ను సమర్థంగా ఉపయోగించుకోవాలి. ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నందున ఉపాధ్యాయులందరికీ టీకాలు వేయడం పూర్తి చేయాలి. గర్భిణులు, 45ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యమివ్వాలి’ అని సీఎం పేర్కొన్నారు.
విలేజ్ క్లినిక్‌లను అనుసంధానించాలి
పీహెచ్‌సీలతో విలేజ్ క్లినిక్‌లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ‘గ్రామంలో ప్రజల ఆరోగ్య వివరాలపై మ్యాపింగ్ జరగాలి. ఆరోగ్యశ్రీ కార్డుపై ఉండే ‘క్యూఆర్ కోడ్’ ద్వారా సంబంధిత వ్యక్తి పూర్తి ఆరోగ్య వివరాలను తెలుసుకునేలా ఏర్పాట్లు ఉండాలి. ఇవి విలేజ్ క్లినిక్‌లలోనూ అందుబాటులో ఉంచాలి. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో వైద్యుడు గ్రామానికి వెళ్లినప్పుడు ఇది ఉపకరిస్తుంది. డిసెంబరు నాటికి విలేజ్ క్లినిక్‌ల భవనాలను పూర్తి చేయాలి. వాటిల్లో ఆశా కార్యకర్తలు రిపోర్టు చేసేలా చర్యలు తీసుకోవాలి.