ప్రతి శాసనసభ నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. ‘మూడేళ్లలో విశ్వవిద్యాలయాలన్నీ బాగుపడాలి. అధ్యాపకుల నియామకానికి అంగీకారం తెలిపాం. మంచి అర్హత కలిగిన వారిని నియమించాలి. నియామకాల్లో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. పారదర్శకత ఉండాలి. పక్షపాతం ఉండరాదు...’ అని ఆయన పేర్కొన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం ఉన్నత విద్యపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ... ‘ప్రతి వారం ఒక్కో వైస్‌ఛాన్సలర్‌తో ఉన్నత విద్యామండలి సమావేశం కావాలి. అనంతరం నేరుగా నా దృష్టికి సమస్యలు తీసుకురావాలి. వాటన్నింటి పరిష్కారానికి ప్రణాళిక రూపొందించాలి. ఇలా వచ్చే మూడేళ్ల కాలానికి కార్యాచరణ ఉండాలి. అన్నీ నాక్ రేటింగ్ సాధించాలి’ అని పేర్కొన్నారు.
విశ్వవిద్యాలయాల్లో మంచి బ్యాండ్‌విడ్త్‌తో ఇంటర్‌నెట్ సదుపాయం పూర్తి స్థాయిలో ఉండాలని, కళాశాలలు కూడా ఖచ్చితమైన నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, లేకుంటే వాటి ప్రతిష్ట దెబ్బతింటుందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ప్రమాణాలు లేనట్లు గుర్తించిన కళాశాలలకు తగిన సమయమిచ్చి అవి మెరుగుపడేలా చూడాలని, అప్పటికీ తగినట్లు లేకపోతే అనుమతులు ఇవ్వరాదని ఆదేశించారు. ‘గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్‌బీకేలు, విలేజి క్లినిక్కులు వంటి వ్యవస్థలు సమర్థంగా పనిచేయడానికి అవసరమైన విధానాలపై, రిజిస్ట్రేషన్, టౌన్‌ప్లానింగ్ విభాగాల్లో పారదర్శకత, పౌరులకు మెరుగైన సేవలు అందించడంపై విశ్వవిద్యాలయాలు అధ్యయనం జరగాలి. అత్యుత్తమ అధ్యాపకుల క్లాసులను రికార్డు చేయాలి. సబ్జెక్టుల వారీగా ఆన్‌లైన్‌లో పెట్టాలి. ఉద్యోగాల కల్పన దిశగా చదువులు ఉండాలి. నిపుణులైన వారితో కోర్సులు రూపొందించాలి. సర్టిఫైడ్ కోర్సులు సిలబస్‌లో భాగమవ్వాలి. శిక్షణను అనుసంధానించాలి. మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలతో నిరంతరం శిక్షణ కొనసాగించాలి. జిల్లా కలెక్టర్‌తో సమన్వయం చేసుకుని నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు కళాశాలలను అనుసంధానించాలి. ఆన్‌లైన్‌లో కూడా నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించాలి. నాలుగేళ్లపాటు ఆంగ్లం, తెలుగు మాధ్యమాల్లో పాఠ్యపుస్తకాలు ఉండాలి...’ అని ముఖ్యమంత్రి సూచించారు.
ఒక్కో విశ్వవిద్యాలయం ఒక్కో రంగంపై పరిశోధనలు చేసేలా పరిశ్రమలతో అనుసంధానం కావాలన్నారు. బేసిక్ ఇంగ్లిష్ తప్పనిసరి సబ్జెక్టుగా ఉండాలన్నారు. దీనివల్ల ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు. ఈ ప్రభుత్వం వచ్చాక విద్యారంగంలో తేడా ఏమిటన్నది కనిపించాలన్నారు. స్థూల ప్రవేశాల నిష్పత్తి 2025 నాటికి 70శాతానికి చేరుకోవాలని చెప్పారు.
సమస్యలున్నా ఫీజు రీఎంబర్స్‌మెంట్: