'జగనన్న తోడు' పథకం కింద చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణం నిధులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. వరుసగా రెండో ఏడాదికి సంబంధించి 3లక్షల 70 వేల 458 మంది చిరువ్యాపారులకు 370 కోట్లు నిధులను విడుదల చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. లబ్ధిదారులు కలెక్టర్లు, నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రాష్ట్రంలో సుమారు 9కోట్ల చిరు వ్యాపారులు ఉండగా.. వారికి బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని సీఎం వ్యాఖ్యానించారు.
గత్యంతరం లేక వడ్డీ వ్యాపారుల వద్ద నుంచి అధిక వడ్డీలకు తీసుకుని తీర్చలేని పరిస్ధితి నెలకొందని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. నూటికి పది రూపాయల చొప్పున వడ్డీ చెల్లించాల్సి వస్తోందని, అధిక వడ్డీలు తీర్చలేక చిరు వ్యాపారలు అష్టకష్టాలు పడుతున్నారని వివరించారు. పాదయాత్రలో వారి కష్టాలను చూసి 'జగన్న తోడు' పథకాన్ని ప్రవేశపెట్టినట్టు తెలిపారు. రెండేళ్లలో 9 లక్షల 5 వేలమంది నిరుపేదలైన చిరు వ్యాపారులకు ప్రభుత్వం నుంచి వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని వెల్లడించారు. వ్యవస్థలను పేదవాడికి ఉపయోగపడేలా తీసుకురావాలన్న సీఎం... అలా చేయలేక పోతే ప్రభుత్వాలు ఫెయిల్ అయినట్లే భావించాల్సి ఉంటుందన్నారు.
బ్యాంకులు, ఆప్కాబ్, స్త్రీనిధిని రంగంలోకి దింపి చిరు వ్యాపారులకు రుణాలు ఇప్పిస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. 3 లక్షల70 వేల 458 మంది చిరువ్యాపారులకి 370 కోట్లు రుణాలు ఇస్తున్నామన్న జగన్... గ్రామాలు పట్టణాల్లో తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్న వారికి సాయం చేస్తున్నట్లు తెలిపారు. సుమారు పది అడుగుల పొడవు, పది అడుగుల వెడల్పు, అంతకంటే ఎక్కువ స్థలంలో దుకాణాలు ఉన్నవారికి, ఫుట్పాత్, తోపుడు బండ్లపై వస్తువులు, కూరగాయలు అమ్మేవారికి ఆర్థిక సాయం అందుతుందన్నారు. టిఫిన్ సెంటర్లు, గంపలు, బుట్టల్లో వస్తువులు అమ్మేవారికి, సైకిల్, మోటార్ సైకిళ్లు, ఆటోలపై వెళ్లి వ్యాపారం చేసుకునే వారికి ఆర్థిక సాయం చేస్తామన్నారు.