‘ఈ అఖండ విజయం ప్రభుత్వంపై, నాపై బాధ్యతను మరింత పెంచింది. ఇంతటి ఘనవిజయం అందించిన ప్రజలకు నిండు మనసుతో హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో విజేతలకు అభినందనలు తెలిపారు. ‘ఇకపై మరింత కష్టపడతాం. మరింత మేలు చేసే క్రమంలో ప్రతి అడుగూ ముందుకే వేస్తామ’ని తెలిపారు. పరిషత్తు ఎన్నికల
ఫలితాల నేపథ్యంలో సోమవారం సీఎం రాష్ట్ర ప్రజలనుద్దేశించి వీడియో సందేశమిచ్చారు. ‘2019 సాధారణ ఎన్నికల్లో 175 ఎమ్మెల్యే స్థానాలకు 151 చోట్ల వైకాపా అభ్యర్థులను గెలిపించారు.
ఇది 86 శాతం. 25 ఎంపీ సీట్లలో 22 మంది వైకాపా తరఫున గెలిచారు. ఇది 87 శాతం. 50 శాతానికి మించి ఓట్లతో ఈ ప్రభుత్వ ప్రస్థానం మొదలైంది. పంచాయతీ ఎన్నికల్లో 13,081కి గానూ 10,536 పంచాయతీల్లో (81%) వైకాపా మద్దతుదారులను ప్రజలు గెలిపించారు. పురపాలక సంస్థలు, నగర పంచాయతీ ఎన్నికల్లో 75కి 74 మాకే దక్కాయి. 12కి 12 నగరపాలక సంస్థల్లోనూ వైకాపాకు ప్రజలు పట్టంగట్టారు. తాజాగా 638 జడ్పీటీసీ స్థానాలకు 628 చోట్ల (98%), 9,583 ఎంపీటీసీలకు 8,249(86%) స్థానాల్లో గెలిపించి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. 2019 నుంచి అన్ని ఎన్నికల్లో ప్రజల దీవెనలతో ఈ విజయాలు దక్కుతుంటే.. కొందరు జీర్ణించుకోలేక దుష్ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95 శాతానికిపైగా ఈ రెండున్నరేళ్లలోనే చేయగలిగాం. అయినా ప్రభుత్వానికి ఇబ్బందులు కల్పించాలని కొన్ని శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయి’ అని పేర్కొన్నారు.
పార్టీల గుర్తులతో జరిగిన ఎన్నికలివి: