'విశాఖ ఉక్కు కర్మాగారంలో 100 శాతం పెట్టుబడులను ఉపసంహరిసామ్తని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో చేసిన ప్రకటన రాష్ట్ర ప్రజలకు, విశాఖ ఉక్కు ఉద్యోగులు, కార్మికులకు తీవ్ర నిరాశ కలిగించింది. ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలని ఇప్పటికే కోరా. ఈ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించడం కన్నా కాస్త అండగా నిలిస్తే నిలుస్తుంది. కచ్చితంగా లాభాల బాటలోకి వస్తుందని నమ్ముతున్నా. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఎలా లాభాల బాటలోకి తీసుకురావచ్చో ఇంతకు ముందే వివరించా. స్వయంగా వివరించేందుకు అఖిలపక్ష నేతలు, కార్మిక నాయకులతో కలిసి వస్తా. లక్ష్య సాధనలో మీతో కలిసి నడుస్తాం. వీలైనంత త్వరగా అపాయింట్‌మెంట్ ఇవ్వండి’ అని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు.
‘ఫిబ్రవరి 6న మీకు రాసిన లేఖలో విశాఖ ఉక్కు కర్మాగారం (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్- ఆర్‌ఐఎన్‌ఎల్, విశాఖ) ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను సూచిస్తూ 100 శాతం పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని పునరాలోచించాలని కోరా. ఇవే విషయాలను కేంద్ర ఉక్కుశాఖ మంత్రికీ తెలియజేశా. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో 100 శాతం వాటాలను అమ్మేస్తామని ఇచ్చిన సమాధానం రాష్ట్ర ప్రజలను నిరాశపరిచింది' అని జగన్ అన్నారు.
ఆర్‌ఐఎన్‌ఎల్ అధీనంలో ఒక ప్రత్యేక సంస్థగా విశాఖ ఉక్కు కర్మాగారం పని చేస్తూ నవరత్న సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. దాదాపు 20వేల మందికి ప్రత్యక్షంగా, మరెందరికో పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. ప్రభుత్వరంగ సంస్థల్లో అతి పెద్దది. దేశంలో సముద్రతీర ప్రాంతంలో ఏర్పాటైన ఈ తొలి ఉక్కు కర్మాగారాన్ని దీర్ఘకాల పోరాటంతో సాధించుకున్నాం. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అనే నినాదంతో సాగిన ఉద్యమంలో 32 మంది చనిపోయారు. 2002 నుంచి 2015 వరకు లాభాల బాటలో నడిచింది అని ముఖ్యమంత్రి అన్నారు.
రూ. లక్ష కోట్ల భూమి ఉంది
విశాఖ ఉక్కు కర్మాగారానికి 19,700 ఎకరాల భూమి ఉంది. ప్రస్తుతం దాని మార్కెట్ విలువ రూ.లక్ష కోట్ల పైమాటే. ఇటీవల ఆర్‌ఐఎన్‌ఎల్ ఈ సంస్థను ఆధునికీకరించడంతోపాటు ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు విస్తరణ చర్యలు చేపట్టింది. వనరుల సేకరణ ప్రయత్నాలు సాగుతున్నాయి. విశ్వవ్యాప్తంగా ఈ రంగంలో ఉన్న మాంద్యం వల్ల 2014-15 నుంచి నష్టాల బాట పట్టింది. సొంత గనులు లేక ఉత్పత్తి వ్యయం పెరిగి లాభాలు పడిపోయాయి. పెట్టుబడులను ఉపసంహరించడం కంటే ఆ సంస్థకు కాస్త అండగా ఉంటే లాభాల బాటలోకి వస్తుందని నమ్మకంతో చెబుతున్నా. ఎక్కువ వడ్డీ రుణాలను తక్కువ వడ్డీకి మార్చడంతో పాటు రుణాలను వాటాల రూపంలోకి మార్చడం, ఇతర అనేక పరిష్కార మార్గాలను మీ దృష్టికి తెస్తున్నామని జగన్ పేర్కొన్నారు.
మరో రెండేళ్లు ఇలా పనిచేస్తే లాభాలే...
- ఉక్కు రంగం ఆర్థిక మాంద్యం నుంచి కోలుకుంటోంది. విశాఖ ఉక్కు కిందటేడాది డిసెంబరు నుంచి ఏడాదికి 6.3 లక్షల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తోంది. ప్రతి నెలా రూ.200 కోట్ల లాభాలను ఆర్జిస్తోంది. ఇలాగే మరో రెండేళ్లు పని చేస్తే విశాఖ ఉక్కు పరిస్థితే మారిపోతుంది.
- ఈ ఫ్యాక్టరీకి సొంత గనులు లేవు. జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థకు (ఎన్‌ఎండీసీ) చెందిన బైలదిల్లా గనుల నుంచి టన్ను రూ.5,260 చొప్పున ముడి ఖనిజం కొంటోంది. దేశంలోని అన్ని ఉక్కు కర్మాగారాలకూ సొంత గనులున్నాయి. అవి తమ అవసరాల్లో 40% ముడి ఖనిజాన్నే ఎన్‌ఎండీసీ నుంచి కొంటున్నాయి. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు 200 ఏళ్లకు సరిపడా ఇనుప ఖనిజ గనులున్నాయి. విశాఖ ఉక్కుకు ముడి సరకును పూర్తిగా బయటే కొనడంవల్ల రూ.3,472 కోట్ల భారం పడుతోంది. ఈ సంస్థ మిగిలిన సంస్థలతో పోటీపడేలా సొంత గనులను కేటాయించాలి. ఒడిశాలో ఉన్న గని ఈ సంస్థ పునరుద్ధరణకు ఉపయోగపడుతుంది.
- సంస్థ స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలను ఈక్విటీలుగా మార్చాలి. దీనివల్ల సంస్థపై రుణభారం, వడ్డీల భారం తగ్గుతాయి. విశాఖ ఉక్కుకు రూ.22వేల కోట్ల రుణభారం ఉండగా ఏకంగా 14% వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. రుణాలను ఈక్విటీలుగా మారిస్తే స్టాక్ ఎక్స్ఛేంజిలో లిస్టు అవుతుంది. ప్రజల నుంచి నిధుల సేకరణకు ఆస్కారం ఉంటుంది.
- విశాఖ ఉక్కు కర్మాగారం పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. మా ఆలోచనలు వివరించేందుకు వీలైనంత త్వరగా అపాయింట్‌మెంట్ ఇవ్వాలి. అఖిలపక్షంతో పాటు కార్మిక నేతలనూ తీసుకుని వస్తా. లక్ష్య సాధన కోసం మీ సమర్థ నాయకత్వంలో, మీతో కలిసి అడుగులు వేస్తాం. - జగన్, ముఖ్యమంత్రి
ఇదీ చదవండి:ఉక్కు పరిరక్షణ కోసం.. ఉరకలెత్తుతున్న విశాఖ జనం