రాష్ట్రంలో ఈ ఏడాది జెండర్ బడ్జెట్ (లింగ ఆధారిత) విధానాన్ని తీసుకొస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ‘మహిళల కోసం ఎంత ఖర్చు చేయబోతున్నామో బడ్జెట్ ద్వారా చెబుతాం. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నాం. దేశంలో ఇంతవరకు ఇలాంటిదెక్కడా జరగలేదు. పని ప్రదేశాల్లో వేధింపుల నిరోధక కమిటీలను ఏర్పాటు చేయాలని చట్టం చెబుతున్నా సక్రమంగా అమలవడం లేదు. చివరికి సచివాలయంలోనే లేదు. వెంటనే అక్కడ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలిస్తున్నా. మిగిలిన చోటా ఏర్పాటు చేస్తాం’ అని హామీ ఇచ్చారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. ‘దిశ పెట్రోలింగ్ పేరిట రాష్ట్రవ్యాప్తంగా మహిళా కానిస్టేబుళ్లకు 900 స్కూటీలను పంపిణీ చేస్తున్నాం. దిశ కేసుల్ని వేగంగా దర్యాప్తు చేసేందుకు 18 స్టేషన్లకు.. అన్ని రకాల సౌకర్యాలు, పరికరాలతో కూడిన 18 వాహనాలను ఇస్తున్నాం. ఠాణాల్లో మహిళా సహాయ డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నాం’ అని సీఎం వివరించారు.
ఒక్కొక్కరికి రూ.7-10 లక్షల ఆస్తిని కల్పించాం
‘ప్రభుత్వ ఉద్యోగినులకు అదనంగా అయిదు ప్రత్యేక సెలవులు ఇస్తున్నాం. ఇళ్లస్థలాలు, పట్టాలు, అమ్మఒడి, ఆసరా, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, జగనన్న విద్యా కానుక, చేయూత తదితర పథకాల ద్వారా 21 నెలల్లో రూ.80 వేల కోట్లను మహిళల చేతిలో పెట్టాం. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలనూ లెక్కలోకి తీసుకుంటే.. ఒక్కో మహిళకు నేరుగా రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల ఆస్తిని కల్పించినట్లవుతుంది’ అని పేర్కొన్నారు.
అప్పటి వారి మాటలు ఆశ్చర్యం కల్గించాయి
‘నేను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు.. ‘కోడలు మగపిల్లాడ్ని కంటానంటే.. అత్త వద్దంటుందా’ అంటూ సీఎం స్థానంలోని వ్యక్తి మాట్లాడారు. కారు షెడ్డులో ఉండాలి, ఆడవాళ్లు ఇంట్లో ఉండాలని అప్పట్లో సభాపతి స్థానంలో ఉన్న వారు కూడా అన్నారు. మనం మహిళలపై ఎలాంటి గౌరవం చూపిస్తామో.. సమాజమూ అలాగే చూపిస్తుందనే కనీస ఆలోచన లేకుండా మాట్లాడారు. ఇలాంటి పరిస్థితులు మారాలి’’ అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.