CJI Justice NV Ramana in Vijayawada న్యాయవ్యవస్థపై ప్రజల్లో గౌరవం, విశ్వాసం ఉన్నప్పుడే అది మనగలుగుతుందని.. ఆ నమ్మకాన్ని కోల్పోతే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. న్యాయవ్యవస్థను పటిష్ఠపరిచేందుకు న్యాయవాదులు సహకరించాలన్నారు. సమస్య పరిష్కారం కానప్పుడు ప్రజలు అంతిమంగా న్యాయవ్యవస్థను ఆశ్రయిస్తారని గుర్తుచేశారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం చేయాలనే తపన న్యాయమూర్తులు, న్యాయవాదులకు ఉండాలని ఉద్బోధించారు. విజయవాడలో నూతనంగా నిర్మించిన కోర్టు భవన సముదాయాన్ని సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ శనివారం ప్రారంభించారు. సీజేఐ పోక్సో న్యాయస్థానం హాల్‌ను, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్‌కుమార్ మిశ్ర ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు హాళ్లను ప్రారంభించారు.
"దాదాపు పదేళ్ల క్రితం ఈ సముదాయానికి శంకుస్థాపన చేశా.. ఇవాళ మళ్లీ నేనే ప్రారంభిస్తుండడం చాలా గొప్ప విషయం. రాష్ట్ర విభజన, ఆర్థిక సమస్యలు, నిధుల జాప్యంతో ఆలస్యమైంది. పూర్తయిన భవనాలను సక్రమంగా వినియోగించుకోవాలి. ప్రజలకు సత్వరం న్యాయం చేయడం అందరి బాధ్యత. ఆర్థిక ఇబ్బందులున్న రాష్ట్రాల్లో భవనాల పూర్తికి నిధులు ఇవ్వాలని కోరా. కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది. కొందరు సీఎంలు.. కేంద్రమే బాధ్యత తీసుకోవాలని మద్దతిచ్చారు." -సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
తెలుగులో మాట్లాడటం మంచి పరిణామం
సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ ప్రసంగిస్తూ. ‘ముఖ్యమంత్రి తెలుగులో మాట్లాడిన తర్వాత నేను తెలుగులో మాట్లాడకపోతే బాగుండదు. తెలుగులో మాట్లాడటం మంచి పరిణామం. వేదికపై ఉన్న వక్తలు ఆంగ్లంలో అనర్గళంగా ప్రసంగించారు. ముఖ్యమంత్రి, నేను తెలుగులో మాట్లాడటానికి ప్రాధాన్యం ఉంటుందని అనుకుంటున్నా. విజయవాడ కోర్టు నూతన భవనానికి 2013 మే 11న శంకుస్థాపన చేశాను. దాదాపు పదేళ్లకు భవనం పూర్తయింది. ఇప్పుడు ప్రారంభించడం గొప్ప విషయంగా భావిస్తున్నా. ఆర్థిక ఇబ్బందుల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం, రాష్ట్ర విభజన, గుత్తేదారు జాప్యం తదితర కారణాలతో భవన నిర్మాణంలో ఆలస్యం చోటు చేసుకుంది. న్యాయవాదుల పోరాట ఫలితంగా ఈ రోజు భవనాల్ని ప్రారంభించుకోగలుగుతున్నాం. కొత్త భవనాన్ని సక్రమంగా వినియోగించుకుని ప్రజలకు సత్వర న్యాయం చేయాల్సిన బాధ్యత న్యాయవాదులు, న్యాయాధికారులపై ఉంది’ అన్నారు.
కోర్టు భవనాల నిర్మాణం, జడ్జీల ఖాళీలను భర్తీ చేయడమనే రెండు ముఖ్యమైన అంశాలను ఎజెండాగా పెట్టుకొని ఏడాదిన్నర కాలంగా దేశవ్యాప్తంగా మాట్లాడానని సీజేఐ చెప్పారు. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్రాల సీజేల సమక్షంలో ఈ విషయాల్ని ప్రస్తావించానన్నారు. రాష్ట్రాలపై భారం పడకుండా న్యాయవ్యవస్థకు అదనపు నిధులిచ్చి భవనాలు నిర్మించే విషయంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని ప్రతిపాదించగా కేంద్రం నుంచి కొంత వ్యతిరేకత వచ్చిందన్నారు. అయినప్పటికీ బెంగాల్, ఏపీ, తమిళనాడు సీఎంలతో పాటు మరికొందరు మద్దతుగా నిలిచారని, అందుకు ధన్యవాదాలు తెలిపారు.
1983లో బెజవాడ బార్ అసోసియేషన్లో సభ్యుడిగా చేరి అభ్యుదయ భావాలున్న కంఠమనేని రవీంద్రరావు దగ్గర జూనియర్ న్యాయవాదిగా పనిచేశానని, గొప్పమనసుతో ఆయన ఆదరించారని జస్టిస్ ఎన్.వి.రమణ గుర్తుచేశారు. అప్పట్లో విజయవాడ కోర్టులో మెజిస్ట్రేట్‌గా పనిచేసిన జస్టిస్ కేజీ శంకర్ హైదరాబాద్‌లో ప్రాక్టీసు ప్రారంభించాలని, సీనియర్ న్యాయవాది అయ్యపురెడ్డి వద్ద జూనియర్‌గా చేరాలని తనకు సలహా ఇచ్చారన్నారు. అయ్యపురెడ్డి దగ్గర చేరాక ఆయన సొంత బిడ్డలా చూసుకున్నారని చెప్పారు. ఈ స్థాయికి రావడానికి సీనియర్ల ప్రోత్సాహం ఎంతో ఉందని గుర్తు చేసుకున్నారు. ‘22 ఏళ్లకు పైగా న్యాయమూర్తిగా పనిచేశాను. త్వరలో పదవీ విరమణ చేయబోతున్నా. నా ఉన్నతికి, విజయానికి కారణమైన మీ అందరికీ కృతజ్ఞతలు’ అన్నారు.
విభజనతో వెనుకబడ్డామని ప్రజల ఆవేదన
రాష్ట్ర విభజన జరిగాక ఆర్థికంగానే కాకుండా అన్ని రంగాల్లో వెనుకబడిపోయామనే ఆవేదన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉందని సీజేఐ చెప్పారు. ఇది కొంతవరకు వాస్తవం కూడా అన్నారు. అందరూ కష్టపడి పని చేసి, రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపించడమే కాక దేశంలో అభ్యుదయ రాష్ట్రంగా తీర్చిదిద్దుతారనే ఆశతో ఉన్నానన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఆర్థికంగా సహకరించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నానని జస్టిస్ ఎన్.వి.రమణ చెప్పారు.
దేశవ్యాప్తంగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దసంఖ్యలో హైకోర్టుల్లో న్యాయమూర్తులను నియమించగలిగానని జస్టిస్ ఎన్.వి.రమణ చెప్పారు. వీటిలో దాదాపు అన్ని ప్రాంతాలు, వర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పించామన్నారు. ‘రాష్ట్రంలో న్యాయవ్యవస్థకు సహకరిస్తామని సీఎం చెప్పారు. విశాఖపట్నం కోర్టు భవనం విషయంలో సమస్య ఉందని ఆయన దృష్టికి తీసుకొస్తున్నా. నిధులు కేటాయిస్తే ఆ భవనం పూర్తవుతుంది. రాష్ట్రంలో అనేకచోట్ల కోర్టు భవన నిర్మాణాలు జరగాల్సి ఉంది. ఓ ప్రణాళిక రూపొందించుకుంటే అసంపూర్ణంగా మిగిలిపోయిన భవనాల నిర్మాణాల్ని పూర్తి చేయడానికి వీలుంటుంది. రూ.55 కోట్ల అంచనాతో ప్రారంభమైన విజయవాడ కోర్టు భవన సముదాయం.. రూ.100 కోట్లకు మించింది. అయినా సీఎం సహకరించడంతో భవనం పూర్తి చేసుకోగలిగాం’ అని సీజేఐ అన్నారు.
న్యాయవ్యవస్థకు సహకరిస్తాం: సీఎం
న్యాయవ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ చేతుల మీదుగా కోర్టు భవన సముదాయం ప్రారంభించడం అరుదైన, గుర్తుండిపోయే ఘట్టమని అభివర్ణించారు. 2013లో జస్టిస్ ఎన్.వి.రమణ శంకుస్థాపన చేసి తిరిగి ఆయనే ప్రారంభించడం దైవ నిర్ణయం అని జగన్ పేర్కొన్నారు. బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని సన్మానించాలని వేదిక మీదకు ఆసనం తీసుకొచ్చారు. సీజేఐ కూడా కూర్చోవాలని ఆహ్వానించగా సీఎం సున్నితంగా తిరస్కరించారు. కుర్చీని తొలగించాలని సూచించి.. జ్ఞాపిక, పుష్పగుచ్ఛాన్ని స్వీకరించారు.
ఆ భవనాలూ పూర్తి చేస్తారని ఆశిస్తున్నాం: ఏపీ హైకోర్టు సీజే
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర మాట్లాడుతూ.. విజయవాడ కోర్టు భవన సముదాయం వేగంగా పూర్తి కావడానికి సహకరించిన ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీ, న్యాయసేవాధికార సంస్థల భవనాలను ప్రభుత్వం నిర్మిస్తుందని అశిస్తున్నానన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్, కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక, బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రగిరి విష్ణువర్ధన్ ప్రసంగించారు. (ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన) ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కొంగర విజయలక్ష్మి, జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ వీఆర్‌కే కృపాసాగర్, జస్టిస్ ఊటుకూరు శ్రీనివాస్ వేదికపై ఆసీనులయ్యారు. కోర్టు భవనాన్ని ప్రారంభించడానికి సతీసమేతంగా విచ్చేసిన సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణకు ఏపీ ముఖ్యమంత్రి, ఏపీ హైకోర్టు సీజే, హైకోర్టు న్యాయమూర్తులు ఘనంగా స్వాగతం పలికారు. కోర్టు ప్రాంగణంలో సీజేఐ మొక్కలు నాటారు. కోర్టు భవనం ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు, విశ్రాంత న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఏజీ శ్రీరామ్, బార్ కౌన్సిల్ ఛైర్మన్ గంటా రామారావు, రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ తదితరులు హాజరయ్యారు. సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణను బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు.
సీజేఐతో సీఎం భేటీ.. రాష్ట్ర ప్రభుత్వ విందు
విజయవాడ విమానాశ్రయం నుంచి నేరుగా నోవోటెల్ హోటల్‌కు వచ్చిన సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణకు ముఖ్యమంత్రి జగన్ స్వాగతం పలికారు. 20 నిమిషాలసేపు వారిద్దరూ భేటీ అయ్యారు. సీజేఐ గౌరవార్థం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం మంగళగిరిలోని కన్వెన్షన్ కేంద్రంలో విందు ఏర్పాటు చేశారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తోపాటు సీఎం జగన్ దంపతులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర దంపతులు హాజరయ్యారు.
ఇవీ చదవండి: