ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వేధింపుల మధ్య బాల్యం.. కష్టాల నడుమ పసితనం - ఏపీలో చిన్నారులపై వేధింపులు

ఆటపాటలతో సాగాల్సిన బాల్యం వేధింపుల బారిన పడుతోంది. అల్లారుముద్దుగా పెరగాల్సిన పసితనం కష్టాల నడుమ కొట్టుమిట్టాడుతోంది. రాష్ట్రంలో గత 16 నెలల కాలంలో చిన్నారులపై వేధింపుల ఘటనలు ఎక్కువగా జరిగాయి. చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) దృష్టికి వచ్చిన వివరాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటివి నాలుగున్నర వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

child abusement in ap
ఏపీలో చిన్నారులపై వేధింపులు

By

Published : Oct 1, 2020, 10:43 AM IST

పసిప్రాయంలోనే చిన్నారులు కామాంధుల కబంధ హస్తాల్లో చిక్కి మానసికంగా కుంగిపోతున్నారు. నమ్మినవారు, నా అన్నవారి కపటప్రేమకు బలై వేదనకు గురవుతున్నారు. బలపం పట్టాల్సిన చేతులతో ఆకలి తీర్చుకోడానికి యాచిస్తున్నారు. రాష్ట్రంలో గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది ఆగస్టు మధ్యకాలంలో చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీల దృష్టికి వచ్చిన వివరాల ప్రకారం చిన్నారుల వేధింపులకు సంబంధించి 4,760 కేసులు నమోదయ్యాయి. చిన్నారులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ కొరవడి లైంగిక వేధింపుల ఘటనలు ఎక్కువగా జరిగాయి. భౌతిక వేధింపులకు గురైన సందర్భాలు భారీగానే ఉన్నాయి. పిల్లల్ని యాచక వృత్తి వైపు మళ్లించడం, బాలకార్మికులుగా మార్చడం, చట్టవిరుద్ధమైన పనుల్లో వారు చిక్కుకుపోయిన ఘటనలూ ఉన్నాయి. కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత బాధితుల ఫిర్యాదు మేరకు సీడబ్ల్యూసీ దృష్టికి రాగా.. మరికొన్ని ఘటనలు ప్రభుత్వం నిర్వహించిన ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమం ద్వారా వెలుగులోకి వచ్చాయి.

పశ్చిమ గోదావరి జిల్లాలో అధికం

దేశవ్యాప్తంగా చిన్నారులపై జరిగిన వేధింపులకు సంబంధించి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను వివరాలు కోరింది. ఆ మేరకు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ కేంద్రానికి వివరాలు నివేదించింది. వీటి ప్రకారం చిన్నారులపై వేధింపులు అత్యధికంగా పశ్చిమగోదావరి జిల్లాలో 1,172 నమోదయ్యాయి. శ్రీకాకుళంలో 781, ప్రకాశంలో 674, విశాఖపట్నంలో 516, కడపలో 239, విజయనగరం 106 సంఘటనలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

తల్లిదండ్రులు పర్యవేక్షణ లేక

కరోనా మహమ్మారి విజృంభణతో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలు మూతపడ్డాయి. సంరక్షణ కేంద్రాల్లో ఉన్న చిన్నారులను ఇళ్లకు పంపించేశారు. తల్లిందండ్రుల సమక్షంలో ఉన్నా పిల్లలపై వేధింపుల మాత్రం తగ్గలేదు. సాధారణ రోజులతో పోలిస్తే లాక్‌డౌన్‌ కాలంలో భౌతిక, లైంగిక వేధింపులు కాస్త తగ్గినా అవి మరో రూపాన్ని సంతరించుకున్నాయి. లాక్‌డౌన్‌ మొదలైన మార్చి నుంచి ఆగస్టు మధ్య 1,642 కేసులు నమోదయ్యాయి. లాక్‌డౌన్‌ కాలంలోనూ పశ్చిమగోదావరి జిల్లాలోనే అత్యధికంగా చిన్నారులపై 577 వేధింపుల ఘటనలు జరిగాయి.

పిల్లలకు అవగాహన కల్పించాలి

పిల్లల్ని ఒంటరిగా వదలటం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. సెల్​ఫోన్ల వంటివీ వారిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయన్నది ఓ విశ్లేషణ. పిల్లల సంరక్షణపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ద్వారా వీటిని నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వేధింపులపై పిల్లలకు అవగాహన కల్పించేలా పాఠ్యాంశాల్లోనూ మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు.

చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీల దృష్టికి వచ్చిన ప్రతి కేసును విచారించి ఎలాంటి సంరక్షణ లేని చిన్నారులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్లలో ప్రత్యేక వసతి కల్పించారు. ఇలా 1,224 మంది పిల్లలకు సంరక్షణ ఇచ్చారు. మిగతా 3,212 మంది చిన్నారులను వారి తల్లిదండ్రులకు అప్పగించారు.

ఇవీ చదవండి..

ఏపీలో ఎస్సీలపై పెరిగిన నేరాలు.. మహిళలపై దాడులూ అత్యధికం

ABOUT THE AUTHOR

...view details